అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ… ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలను నమ్మించి ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నందున ప్రజాభిప్రాయం కోరేందుకు అసెంబ్లీని రద్దు చేయాని.. డిమాండ్ చేస్తూ..ఆయన 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్‌లైన్‌పై వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. దీంతో మరోసారి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు గతంలో… వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.
రాజధానిపై ఎన్నికల ముందు అమరావతినే కొనసాగిస్తామని చెప్పి… ఇప్పుడు ఐదు కోట్ల మందిని మోసం చేసి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ప్రజలకు ద్రోహం చేయడం నీచమన్నారు. ప్రజాభిప్రాయం కోరేందుకు వైసీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం..తిరుగుబాటు రావాలని పిలుపునిచ్చారు. వెన్నెముక లేని నాయకులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని .. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. రాజధాని అమరావతికి జగన్ ఒప్పుకుంది వాస్తవం కాకపోతే… మీరు చేసింది న్యాయమని విశ్వాసం ఉంటే.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. రాజధాని విషయంలో చాలా నష్టం జరుగుతోందని భూములు ఇచ్చిన రైతులు రోడ్డునపడి బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్లాలని .. ఎన్నికలంటే జగన్ పారిపోతున్నారని విమర్శించారు.
కేంద్రం జోక్యం చేసుకొని రాజధానిని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అంటున్నారు. రాజధాని రైతులకు జరుగుతోన్న అన్యాయంపై.. వైసీపీ నేతలు జగన్‌ను నిలదీయాల్సి ఉందన్నారు. సోషల్‌మీడియా ద్వారా మనోభావాలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండు రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వస్తాననని రాజధాని అమరావతిపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తానని స్పష్టం చేశారు.
గతంలో అమరావతికి మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను…టీడీపీ నేతలు ఇంతకు ముందు విస్తృతంగా సోషల్ మీడియాలోప్రచారానికి పెట్టారు. చంద్రబాబు కూడా వాటిని ప్రదర్శించారు. చంద్రబాబు సవాల్‌పై… గతంలో అమరావతికి మద్దతుగా తాము మాట్లాడిన మాటలపై..ఒక్క వైసీపీ నేత కూడా స్పందించలేదు. దీంతో వైసీపీ కిక్కురుమనకుండా ఉంటోందన్న చర్చ జరుగుతోంది.