అమరావతిని పట్టాలెక్కిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటిని కూడా సమాంతరంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వెలగపూడి వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొనుగోలు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ కు సమీపంలో.. ఇతర పాలనాభవనాలకు దగ్గరగా ఉండేలా ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో నివాసాన్ని నిర్మించనున్నారు. బహుళ అంతస్తులు కాకుండా.. రెండు అంతస్తుల్లోనే నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.
ఇల్లు పూర్తిగా నారా భువనేశ్వరి ఆలోచనల మేరకు నిర్మిస్తున్నారు. అమరావతి నిర్మాణం ఇప్పటికే ప్రారంభమయింది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు పనులు ప్రారంభించడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచే అధికారికంగా అమరావతి రీస్టార్ట్ అవుతుంది. చంద్రబాబు ఇల్లు కూడా సమాంతరంగా నిర్మిస్తారు.
రెండేళ్లలో అమరావతిని ఓ రూపు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి చాలా నిర్మాణానికి పునాదులు కూడా రెడీ ఉన్నాయి. అధికారులు, ఉద్యోగుల బంగ్లాలకు ఫనిషింగ్ టచ్ ఇస్తే సరిపోతుంది. ప్రధానంగా హైకోర్టు, పాలనా భవనాలు, అసెంబ్లీ నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అమరావతి ప్రాథమిక దశ పూర్తవుతుంది. ఈ నిర్మాణాలతో పాటు ప్రైవేటు సంస్థల నిర్మాణాలు కూడా జోరుగా సాగేలా చూడనున్నారు.