పరిపాలన అనేది నాయకుల బాధ్యత, కర్తవ్యం. అంతేగానీ, అదేదో పూర్వజన్మ సుకృతమో, దేవుడు ఇచ్చిన వరమో కాదు కదా! అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మారు, ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకం పట్ల గౌరవం ప్రదర్శించడం వరకూ ఓకే. అంతేగానీ, పరిపాలనలో భాగంగా చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని తనకే దక్కిన అదృష్టంగా ప్రతీసారీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే.. పాలనాపరమైన అంశాలకు కూడా సెంటిమెంట్ జోడించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విజయవాడలో అమరావతి డీప్ డైవ్ వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. నూతన నగరం నిర్మించడం భగవంతుడు తనకు ఇచ్చిన వరమని భావిస్తున్నా అన్నారు. నగరాలు నిర్మించే అవకాశం రావొచ్చుగానీ, రాజధాని నిర్మించే ఛాన్స్ చాలా అరుదుగా వస్తుందన్నారు.
అమరావతికి తాను ఇవ్వాల్సింది చాలా ఉందన్నారు. గత ఎన్నికల్లో సింగపూర్ లాంటి అత్యుత్తమ రాజధాని నగరం నిర్మించి ఇస్తానని ప్రజలకు మాటిచ్చాననీ, అంతకుమించిన అంతర్జాతీయ స్థాయి నగరం నిర్మించాలని తాను భావిస్తున్నాను అన్నారు. 11 దేశాలకు చెందిన దాదాపు 400 మంది నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటివి కనీసం ఆర్నెల్లకు ఒకటైనా జరిగితే బాగుంటుందని చంద్రబాబు అన్నారు. సరే, అంతర్జాతీయ స్థాయి నగరం నిర్మించి ఇవ్వాలనే ఆకాంక్ష మెచ్చుకోదగ్గదే. వాస్తవం మాట్లాడుకుంటే… ఇంకా అమరావతి నగర నిర్మాణం డిజైన్ల దశలోనే ఉంది.
ప్రస్తుతం రాజధానిలో కనిపిస్తున్న నిర్మాణాల్లో తాత్కాలిక ఏర్పాట్లే ఎక్కువగా ఉన్నాయి. రాజధాని నిర్మాణంపై గత ఎన్నికలకు ముందు మాటిచ్చానని సీఎం చెబుతున్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ప్రజలు ఇచ్చిన అవకాశం వరమనీ, తన కల అనీ చెప్తున్నారు కదా… వచ్చే ఎన్నికల నాటికి కూడా ఆ కల ఇంకా డిజైన్ల స్థాయిలోనే ఉండేట్టు కనిపిస్తోంది. మాటిచ్చిన ప్రజలకు… వచ్చే ఎన్నికల్లో కూడా ఈ డిజైన్లనే చూపిస్తారా..? కారణాలు ఏవైనా కొవొచ్చుగానీ, అమరావతి నిర్మాణ ప్రక్రియ నత్త నడకన సాగుతోందన్నది వాస్తవం. డిజైన్ల కోసం మొదట ఒక కంపెనీకి బాధ్యతలు అప్పగించారు, ఆ తరువాత.. ఆ కంపెనీని కాదనుకుని మరొకరికి బాధ్యతలు ఇచ్చారు. ఆ మధ్య కొన్ని డిజైన్లు వస్తే బాగులేవనే అభిప్రాయం వ్యక్తం కాగానే, మళ్లీ కొత్త డిజైన్లు అన్నారు. ఈ మధ్య మళ్లీ లండన్ వెళ్లి తుది డిజైన్ల రూపకల్పన అన్నారు, సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు అన్నారు. ఆయనేమో.. సూర్యకాంతిని అద్దాల ద్వారా ప్రసరింపజేసి, ఆ కిరణాలు తెలుగు తల్లి విగ్రహం పాదాలపై పడేట్టు చేస్తు బాగుంటుందంటూ ఓ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు! చంద్రబాబు చెబుతున్న ఆ వరం, అరుదైన అవకాశం, పూర్వజన్మ సుకృతం… ఏదైనా కొవొచ్చు, రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభ దశ కంటే ఇంకా కాస్త వెనక్కే ఉంది! గత ఎన్నికల్లో మాటిచ్చానని చెప్పి, వచ్చే ఎన్నికల్లో ఈ డిజైన్లు ప్రజలకు చూపిస్తే సరిపోవు కదా!