ఓల్డ్ చంద్రబాబును మళ్లీ చూస్తారంటూ చాలా సార్లు చెప్పారు కానీ ఇంకా ఆ మార్క్ కనిపించడం లేదు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు బయటకు వచ్చానంటే రాష్ట్రం మొత్తం అలర్ట్ అయిపోయేదని ఎక్కడికి వస్తానో అని అందరూ తమ పనులు తాము సరిగ్గా చేసుకునేవారని చంద్రబాబు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. మళ్లీ అలాంటి ఆకస్మిక పర్యటనలకు సిద్దమవుతున్నట్లుగా శనివారం ప్రకటించారు.
తణుకులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చిలో ప్రారంభించిన ఈ కార్యక్రమంతో 9 నెలల్లో అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించేందుకు రెడీ అవుతున్నానని తెలిపారు. తాను ప్రయాణించే హెలికాఫ్టర్ ఎక్కడైనా దిగొచ్చని మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్త చేయాలని అధికారులకు సూచించారు. తర్వాత జరిగే పరిణామాలకు తనను నిందిస్తే ప్రయోజనం ఉండబోదని కూడా హెచ్చరించారు. గతంలో ఇంత సమయం ఇచ్చేవాడిని కాదన్నారు.
చంద్రబాబు సీరియస్ గా ఆకస్మిక తనిఖీలు చేసి ..తప్పులు కనిపెట్టిన చోట కఠిన చర్యలు తీసుకుంటే.. వచ్చే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. చంద్రబాబు ఆకస్మిక తనిఖీల వల్ల కొంత మార్పు వచ్చినా ప్రజలకు మేలు జరుగుతుంది.