ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి కొలువు దీరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిధిగా ఆయన సమక్షంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. మంత్రులుగా మరో ఇరవై నాలుగు మంది ప్రమాణం చేశారు. వీరిలో జనసేన తరపున ముగ్గురు, బీజేపీ తరపున ఒక్కరు ఉన్నారు.
చంద్రబాబు మంత్రివర్గంలో యువత ఎక్కువగా ఉన్నారు. అందుకే ప్రమాణ స్వకారం ఉత్సాహంగా సాగిపోయింది. మొదట చంద్రబాబు, తర్వాత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత లోకేష్ అలా ప్రమాణ వరుస సాగిపోయింది. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రమాణం చేస్తున్నప్పుడు సభా వేదిక దద్దరిల్లిపోయింది. ఊహించిన దాని కంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇక మెగా కుటుంబం అంతా తరలి వచ్చింది. పార్టీల ముఖ్య నేతలు.. ఇతరులతో గ్యాలరీలన్నీ ప్రముఖులతో నిండిపోయాయి.
చంద్రబాబు ప్రమాణానికి ఢిల్లీ నుంచి ప్రముఖులు తరలి వచ్చారు. కేంద్ర మంత్రులతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. ప్రమాణానికి ముందు వీరంతా.. అక్కడి సభా ఏర్పాట్లను.. జనాలను చూసి ఆశ్చర్యపోయారు. ప్రముఖులందరికీ.. ప్రజలు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చిరాగ్ పాశ్వాన్ నూ ప్రజలు గుర్తు పట్టి నినాదాలు చేయడంతో ఆయన కూడా ఆశ్చర్యపోయారు.
మొత్తంగా చంద్రబాబు 4.0 ప్రభుత్వం ఓ పండగలా కొలువుదీరింది. వచ్చే ఐదేళ్లు ప్రజలకు కూడా ఈ పండగ ఫలాలు అందించేలా పాలన అందించాలని అందరూ కోరుకున్నారు.