మిత్రపక్షం టీడీపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉభయ సభల్లో ప్రసగించారు. ఆంధ్రా గురించి తూతూ మంత్రంగా మాట్లాడారు. ఆ తరువాత, దిద్దుబాటు చర్యలకు దిగడం… మంత్రి సుజనా చౌదరితో చర్చించడం, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కొంత చొరవ తీసుకోవడం.. ఇవన్నీ జరిగాయి. అయితే, ఇదంతా మోడీ సూచనల ప్రకారమే జరిగిన పరిణామాలుగా ఇప్పుడు తెలుస్తోంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లినా… ఆంధ్రా విషయమై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలతో మాట్లాడుతూనే ఉన్నారట. ఏపీ సీఎం చంద్రబాబుతో టచ్ లో ఉండండీ అంటూ పురమాయించారట.
దుబాయ్ టూర్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తరువాత అమిత్ షా రెండుసార్లు ఫోన్లో మాట్లాడిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేంద్రం తరఫున ఆయన భరోసా కల్పించే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర కేటాయింపులపై అంశాల వారీగా ప్రధాని చర్చిస్తారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా, మిత్రపక్షాలను దూరం చేసుకోకూడదు.. అనే ఓ నిర్ణయంతో ప్రధాని ఉన్నట్టుగా కనిపిస్తోంది.
రాజస్థాన్ లో ఇటీవలే మూడు స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే.. భాజపా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడ కూడా కొన్ని దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. రైతు రుణమాఫీ ప్రకటిస్తున్నారు. భాజపా సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈ ప్రకటన చేస్తూ ఉండటం విశేషమే. ఇక, కర్ణాటక విషయానికొస్తే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడం, అక్కడ వాతావరణం కాంగ్రెస్ కు మరింత ఉత్సాహవంతంగా కనిపిస్తోంది. గుజరాత్ ఫలితాల అనంతరం సర్వేలు కూడా భాజపాపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు సంతృప్తిగా లేరని తేల్చాయి. దీంతో సంప్రదాయ భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకోకూడదన్న వాస్తవాన్ని భాజపా గ్రహించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ సర్కారు డిమాండ్లకు కొంత దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.
అయితే, గతంలో మాదిరిగా కేంద్రం హామీలు ఇస్తే సంతృప్తి చెంది, వేచి చూసే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రాలో లేదు. ఇది కేంద్ర పెద్దలకు అర్థం కాని విషయమేమీ కాదు. సో.. పొత్తు నిలుపుకోవాలన్న రాజకీయ అవసరం భాజపాకి ఎలాగూ ఉంది కాబట్టి… చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకుని చర్చించే అవకాశాలు ఉన్నట్టే కనిపిస్తోంది.