కలలు కనడం మానకండి అని పెద్దలు చెప్పారు. అంటే, దానర్థం ఒకటో కలను సాకారం చేసుకున్నాకనే.. రెండో కల కనండీ అని! అంతేగానీ, రోజుకో కలగంటూ.. దాని గురించి మర్నాడు మాట్లాడకుండా, మరో కల గురించి చెప్తూ పోతే ఎలా..? కొన్ని ఆకాంక్షల విషయంలో ఏపీ సీఎం దాదాపు ఇలానే ఉన్నారేమో అనిపిస్తోంది. రాష్ట్రం గురించి ఆయన ఎన్నో కలలు కంటున్నారు. మంచిదే.. ఎందుకంటే, విభజన తరువాత ఏపీకి చాలా అన్యాయం జరిగింది. రాజధాని కూడా లేకుండా కేంద్రం చేసింది. ఇక, నిధులూ కేటాయింపుల విషయంలో కేంద్రం కురిపిస్తున్న సవతి తల్లి ప్రేమ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తారు అనే ఆశ సీఎం చంద్రబాబు కొంతమేర కల్పించారనే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటున్నారు, రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ అంటున్నారు, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అంటున్నారు.. వాస్తవంలో కూడా కొంత పని కనిపిస్తోంది. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. అదేనండీ.. యువతకు ఉపాధి!
ఇంటికో ఉద్యోగం కల్పిస్తామంటూ ఎన్నికల ముందు యువతకు హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి కూడా అన్నారు. రేపోమాపో భృతి ఇస్తామని తాజాగా చెబుతున్నారు. ఇవన్నీ ఇప్పుడే ఎందుకు గుర్తొస్తున్నాయంటే… గన్నవరం సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాటలు విన్నాక..! దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో 75 ఎమ్.ఎస్.ఈ.ఎమ్.లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో యువత ఉద్యోగాలు కావాలీ అని కోరుకునే దశ నుంచీ.. వారే ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు హబ్ గా మారుతోందనీ, ఇంటికో పారిశ్రామిక వేత్త ఉండి తీరాలని చెప్పారు! ఆ తరువాత, రాష్ట్ర విభజన.. తదనంతర పరిస్థితులు, టీడీపీ సర్కారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి మధ్యలోంచి సాధిస్తున్న ప్రగతీ అనే అంశాలపై రొటీన్ ప్రసంగం చేశారు.
ఇంటికో ఉద్యోగం అనే హామీ ఏమేర పూర్తయిందో లేదో తెలీదుగానీ, ఇప్పుడు ఇంటికో పారిశ్రామిక వేత్త విధిగా ఉండాలని చంద్రబాబు చెప్పడం విశేషం! ఆయన ఆకాంక్ష మంచిదే.. కానీ, నిరుద్యోగులు, యువత ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకుంటారు..? టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నాళ్లుగానో ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లోని ప్రభుత్వోద్యోగాల భర్తీ ఉంటుందని అనుకున్నారు. కానీ, ఆ దిశగా వచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని..? సరే, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలంటే.. అవి కూడా ఆశించిన స్థాయిలో దక్కలేదనే వాదనా ఉంది. పైగా ఉన్నవి తీసేశారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం నుంచి ఏ రూపంలోనైనా యువతకు సాయం అందినా… దాన్ని కూడా ప్రభుత్వం కల్పించిన ఉపాధిగానే చూడాలంటూ ఆ మధ్య మంత్రి నారా లోకేష్ ఓ విశ్లేషణ ఇచ్చారు! నిజానికి, ఇంటికో పారిశ్రామిక వేత్త ఉండాలీ, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలీ అనేది దీర్ఘకాలిక లక్ష్యాలుగా పెట్టుకోవాలి. వాటినెవ్వరూ తప్పుబట్టరు. కాకపోతే, ప్రస్తుతం ఏంటనే ప్రశ్న ఇంకా ప్రశ్నగానే ఉండిపోయింది కదా! ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందనే ప్రశ్న నిరుద్యోగుల్లో ఇప్పటికీ ఉంది. ఈ కలను ముందు సాకారం గురించి స్పష్టత ఇచ్చాక మరో కల గురించి ఎంత మాట్లాడినా బాగుంటుంది.