ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీల నేతలందరూ.. కొత్త ఏడాది వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు అందరూ.. రైతులకు మద్దతుగా ఉంటామని.. కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవడం లేదని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నూతన సంవత్సరం వేడుకలను రాజధాని రైతులతో జరుపుకోబోతున్నారు. రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలిచ్చిన రైతులు ,వారి కుటుంబాలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తోన్న తరుణంలో వారికి సంఘీభావంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. బుధవారం కుటుంబ సమేతంగా చంద్రబాబు రాజధాని గ్రామాల్లో జరిగే దీక్షల్లో పాల్గొననున్నారు.
రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రైతులకు సంఘీభావంగా ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయా గ్రామాల్లో పర్యటించారు. వెలగపూడి, మందడం, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్ధతు ప్రకటించారు. బోకెలు, స్వీట్లు, ఇతర వేడుకలకు స్వస్తి చెప్పి.. వాటికయ్యే ఖర్చును రాజధాని రైతులకు సంఘీభావంగా నిలిచేందుకు తోడ్పడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన రాజధాని గ్రామాల రైతులతో దీక్షల్లో పాల్గొనాలని నిర్ణయించారు. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ర్శించుకోనున్నారు. అక్కడ్నుంచి నేరుగా రాజధాని గ్రామాలకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన రాజధాని గ్రామాల రైతుల దీక్షలో పాల్గొనబోతున్నారు.
టీడీపీ కేడర్, నేతలు కూడా రైతులకు సంఘీభావంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్… కూడా.. నూతన ఏడాది వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పవన్ ఇప్పటికే రైతులకు ధైర్యం చెప్పారు. కమ్యూనిస్టు పార్టీల నేతల.. ఇతర పార్టీల క్యాడర్ కూడా… రైతులకు మద్దతివ్వడమే.. తన నూతన ఏడాది సంబరమని ప్రకటించారు.