తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో మళ్లీ తమ కార్యాచరణ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు వారికి వివరించారు. జాతీయస్థాయిలో మద్దతు అవసరమని..బీజేపీయేతర పార్టీల మద్దతు పొందాలని నిర్ణయించారు. భావస్వారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలి.36ఏళ్లుగా టిడిపి ఇదే రాజకీయ విధానంతో పనిచేస్తోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఏమిటన్నదానిపై చర్చించారు. ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకత. రెండవది బిజెపి వ్యతిరేకత.. బిజెపి మనపై ఒంటికాలితో వస్తోంది.. ఈ పరిస్థితుల్లో బిజేపియేతర పార్టీల సహకారం తీసుకోక తప్పని స్థితి. అదే డెమోక్రాటిక్ కంపల్సన్. దీని వల్లేనే రాజకీయ పొత్తులని తేల్చారు.
ఎంపీల ఢిల్లీ కార్యక్రమాలు ఆసక్తికంగా ఉన్నాయి. ఇంకా ఐదారు నెలల సమయంలో ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. మొదటగా దేశవ్యాప్తంగా కాన్ క్లేవ్ లను నిర్వహించాన్నారు. ఇందులో కేంద్ర,రాష్ట్ర సంబంధాలు,సర్కారియా కమిటి సిఫారసుల అమలు, రైతు సమస్యలపై జాతీయస్థాయిలో సదస్సు, ఇతర అంశాలను అధ్యయనం చేస్తారు. అలాగే రాఫెల్ కుంభకోణంపై ఏవిధంగా స్పందించాలి..? బోఫోర్స్ స్కామ్ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేయాలి. అప్పట్లో బోఫోర్స్ స్కామ్‌ను చూపి.. 105మంది ఎంపిలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.రాష్ట్రపతిని కలిసి వినతి అందించారు.
అప్పటి ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తారని హెచ్చరించారు. ఈ ఐదారు నెలల్లో జాతీయస్థాయిలో ఎంపిల పోరాటం ఈ స్థాయిలో ఉండాలని నిర్దేశించారు. జాతీయస్థాయిలో మన ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి..? కొత్తపొత్తులు మినహా మార్గాంతరం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ఉన్నాడు,వెంకయ్యనాయుడు ఉన్నాడు..గుజరాత్ కు ఎవరు ఉన్నారు ? అని కేంద్ర కేబినెట్ లోనే నరేంద్రమోడి అన్నమాటలు ఆయన నైజానికి నిదర్శనం. గుజరాత్ కు ఏపి ఎక్కడ పోటి అవుతుందో అనే భయం ఆయనలో ఉందని ఆ మాటలే బైటపెట్టాయన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తులేదని బీజేపీనే ఏకపక్షంగా ప్రకటించింది. టిడిపిని బలహీన పర్చే కుట్రకు అప్పుడే అంకురార్పణ జరిగింది. జగన్ తో ఇక్కడ,కేసిఆర్ తో అక్కడ బిజెపి రహస్య ఒప్పందం అప్పుడే జరిగిందని చంద్రబాబు వివరించారు. భాగస్వామ్య పార్టీలలో సమర్ధమైన నాయకత్వాన్ని బలహీన పరిచే కుట్ర చేశారని వివరించారు.
ఐటి దాడులు రాజకీయ కోణంలో జరిగాయన్నారు. దాడులతో భయోత్పాతం సృష్టించడం సరికాదు.కర్ణాటకలో,తమిళనాడులో,తెలంగాణలో దాడుల తరహాలోనే చేస్తున్నారు. రేవంత్ అంశంతో మనకు ముడిపెట్టాలని కుట్రపన్నారన్నారని విశ్లేషించారు. బిజెపి ఇమేజి దేశవ్యాప్తంగా బాగా పడిపోయిందన్న చంద్రబాబు ఎంపీలకు స్పష్టమైన దిశానిర్దేశాన్నే చేశారు.