కర్ణాటకలో అట్టహాసంగా కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా ఆహ్వానించారు. అయితే, కాంగ్రెస్ తో వేదిక పంచుకోవాల్సి వస్తుందనీ, అదే జరిగిన విమర్శలు తప్పవన్న ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త జాగ్రత్తపడ్డారు. ఒకరోజు ముందే బెంగళూరు వెళ్లి, కుమార స్వామిని అభినందించి వచ్చేశారు. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. అందరూ వేదికపై ఫొటోలు దిగుతుంటే కాస్త దూరంగానే ఉన్నారు. ఆ తరువాత, సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలతో ఇంతకుమించి పలకరింపులూ సంభాషణలూ లేకపోయినా… కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఏర్పడుతున్న కర్ణాటక ప్రభుత్వానికి చంద్రబాబు కూడా అనుకూలంగా ఉన్నారనే విమర్శలు తప్పవనే అనిపిస్తోంది.
గడచిన కొన్ని రోజులుగా భాజపా ఇదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబులో ఉన్నది కాంగ్రెస్ రక్తమే అంటూ సోము వీర్రాజు ఆ ఒక్క పాయింట్ మీదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం బెంగళూరుకు వెళ్లొచ్చారు కదా… ఇక వారి విమర్శలు మరింత పదునెక్కే అవకాశం ఉండనే ఉంది. ఇక, ప్రతిపక్ష పార్టీ వైకాపాకి కావాల్సిన స్టఫ్ దొరికినట్టే..! రాహుల్ గాంధీ పక్కన చంద్రబాబు నిలబడ్డట్టు ఒకటో రెండో ఫొటోలు ఉన్నాయి. వాటిని పెట్టుకుని సోషల్ మీడియాలో కావాల్సినంత ప్రచారం చేస్తుంది.
నిజానికి, బెంగళూరు పర్యటనకు చంద్రబాబు వెళ్లకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయమూ కొంతమందిలో వ్యక్తమౌతోంది. చిరకాల మిత్రుడు దేవెగౌడ కుమారుడి ప్రమాణ స్వీకార కార్యక్రమమే అయినా… అక్కడ ఏర్పడింది కాంగ్రెస్ సంకీర్ణం కదా. ఏపీకి కాంగ్రెస్ చేసిన విభజన గాయాలు ఇంకా మాననే లేదు. ఈరోజున ఏపీ కష్టాలకు కారణం కాంగ్రెస్ అనే ఆగ్రహం ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇక, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం నుంచి. ఇలాంటప్పుడు, కాంగ్రెస్ తో దగ్గరతనం చూపించే సంకేతాలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా టీడీపీ ఉండాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహార శైలి ఉంటోందన్న ఊహాగానాలు కూడా తెలుగుదేశం పార్టీకి తలనొప్పి తెచ్చే అంశమే అవుతుంది. కనీసం, కేసీఆర్ మాదిరిగా మధ్యే మార్గం అనుసరించి.. ఒకరోజు ముందో వెనకో వెళ్లి, అభినందించి వచ్చేస్తే సరిపోయేదేమో..! మొత్తానికి, చంద్రబాబు బెంగళూరు పర్యటన విపక్షాలకు ఒక బలమైన విమర్శనాస్త్రంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.