ఎపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో పార్టీ ముఖ్యనేతలపైనే చికాకు ప్రదర్శించడం పెరుగుతున్నది. విశేషం ఏమంటే ఈ విషయాన్ని మీడియాలో కూడా రాయించడం. లోలోపల చెబితే సర్దుకునే దశ దాటిందని ఆయన అనుకుంటున్నారన్నమాట. మంత్రులను,ఎంపిలు ఎంఎల్ఎలను మందలించడంతోనే చాలా సమయం గడిచిపోతున్నట్టుంది. ఆయన చెబుతున్న కొద్ది పదేపదే ఉల్లంఘనలు వివాదాలు పెరుగుతుండటం మరో విపరీతం.దాంతో ఆయన అసహనం మరింత పెరుగుతుండొచ్చు. కొద్ది రోజుల కిందటే ఆయన పార్టీ నేతలు సమస్యలు అధ్యయనంచేయడం లేదని వచ్చే రాజకీయ దాడులను ఎదుర్కోవడం లేదని కోప్పడ్డారు. పదవులు తీసుకున్న వారు టీవీ చర్చలకు కూడా పోవడం లేదని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. పదేళ్లకు పైగా టీవీ చర్చలలో పాల్గొంటున్న వ్యక్తిగా ఇది మాత్రం నిజమని చెప్పగలను. ఎందుకంటే టిడిపి సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు చర్చలకు రావడం బాగా తగ్గిపోయింది. ఎపిలో ప్రధానంగా ఇద్దరు ముగ్గురు యువ ప్రతినిధులే ఆ పని చేస్తున్నారు. వారికి పదవులు లేవు గాని పలుకు వుంటుంది. అధినేతలను మెప్పించడం కోసం అప్పుడప్పుడు అవసరాన్ని మించి ఆవేశపడుతుంటారు కూడా. అయితే నోరున్న వారు చాలామంది పార్టీని ప్రభుత్వాన్ని సమర్థించేందుకు ముందుకు రావడం లేదు. అంటే సమర్థించలేని స్థితిలో పడిపోయారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ కారణంగానే చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పినట్టున్నారు. ఇకపోతే ఎంపిలతో జరిపిన సమావేశంలో నియోజకవర్గ కమిటీల ఏర్పాటు గురించి చెప్పడం కూడా భవిష్యత్ ఎంపికలపై ఒక హెచ్చరికే. తాను జిల్లాలలో పర్యటిస్తానని చెప్పడం ద్వారా అప్రమత్తంగా వుండమని సూచిస్తున్నారన్నమాట. మరి ఆయన కాయకల్ప చికిత్సలు ఏ మేరకు పని చేస్తాయో చూడాల్సిందే.