అవినీతీ నల్లధనంపై పోరాటం చేయాలంటే పెద్ద నోట్లను రద్దు తప్పదనీ, లావాదేవీలన్నీ చెక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మాధ్యమాల ద్వారానే జరగాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎప్పుడో చెప్పారు కదా! వెలగపూడిలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రారంభించిన నాడే పెద్ద నోట్ల గురించి ఆయన మాట్లాడారు. ఆ తరువాత, కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసింది. తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి స్పందించారనే రేంజిలో క్రెడిట్ కోసం పాకులాడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, ఇప్పుడు తత్వం బోధపడుతోందో ఏమో… పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మనం కోరుకున్నది కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాసింది ఆయనే కదా! కానీ, ఇప్పుడా మాట మారుస్తున్నారు. నోట్ల రద్దు మనం ఆశించింది కాదని ఆయన అన్నారు. దీనివల్ల చాలా కష్టాలూ నష్టాలు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. తన అనుభవంలో ఎన్నో సంక్షోభాలను అధగమించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం జఠిలంగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హుద్‌హుద్ తుఫాను, ఆగష్టు సంక్షోభం ఇలా అన్ని సమస్యల్నీ తాను సమర్థంగా ఎదుర్కొన్నాను అన్నారు. కానీ, నోట్ల రద్దు తరువాత వస్తున్న కష్టాలను మాత్రం పరిష్కరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీరోజూ బ్యాంకర్లతో ఓ రెండుమూడు గంటలు సమీక్షలు నిర్వహించినా పరిస్థితిలో మార్పు ఉండటం లేదని చంద్రబాబు చెప్పారు.
డిసెంబర్ నెలలో ఫించెన్లు పూర్తిస్థాయిలో అందించలేకపోయామనీ, ఎంతోమంది వృద్ధులు బ్యాంకుల ముందు సొమ్ము కోసం నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నగదును తగ్గించే క్రమంలో కేంద్రం ఉందనీ, కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందరూ చేసుకోవాలనీ, నగదు రహిత లావాదేవీలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
మొత్తానికి, చంద్రబాబుకు ఇప్పటికి తత్వం బోధపడిందన్నమాట. ప్రజలు కష్టాలు మొదట్నుంచీ పీక్స్‌లోనే ఉన్నాయి. కాకపోతే, చంద్రబాబుకు అర్థమయ్యేసరికి ఇంత సమయం పట్టినట్టుంది. చిత్రం ఏంటంటే… పెద్దనోట్లను రద్దు చేయమని మొదట్నుంచీ చెబుతూ వచ్చిన ఆయనే, ఇప్పుడా మాట మారుస్తున్నట్టుగా వ్యాఖ్యానించడం! అంటే, నోట్ల రద్దు నిర్ణయం ఆయన ఆశించింది కాదన్నమాట!