ముఫ్ఫై ఏళ్ళకు పైగా రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకు తప్పేంటో ఒప్పేంటో బాగా తెలుసు. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుల గురించి మాత్రం మా గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు. పుస్తకాల్లో ఉన్న నీతులన్నీ కూడా వల్లిస్తూ ఉంటారు. కానీ టిడిపి నేతల తప్పులను మాత్రం చూసీ చూడనట్టుగా నటిస్తూ ఉంటారు. జగన్ అక్రమ కేసుల గురించి రోజుల తరబడి మాట్లాడగల సత్తా బాబు సొంతం. ఆ కేసును విచారిస్తున్న సిబిఐ, ఈడిలతో పాటు కోర్టులకు కూడా జగన్ కేసుల గురించి బాబుకు తెలిసినంతగా తెలుసో తెలియదో నిక్కచ్చిగా చెప్పలేం. అవినీతి పరులకు శిక్షపడాల్సిందే కాబట్టి ఆ విషయంలో బాబు నాలెడ్జ్‌ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. మరి అదే బాబుకు ఓటుకు నోటు కేసు గురించి మాత్రం ఎబిసిడిలు కూడా తెలియకుండా పోతాయి? ఒకవేళ కేసు గురించి తెలియదనే అనుకుందాం. కనీసం ‘బ్రీఫింగ్’ వాయిస్ తనదా? కాదా? అనే విషయం కూడా తెలియకుండా ఎలా ఉంటుంది? తెలియదనే ఆయన చెప్తారు. అది కూడా ఇండియాలో ఉన్న ప్రజలందరికీ వినిపించేలా జాతీయ మీడియాతో అలాంటి మాటలు చెప్తాడు బాబు. ఆ వాయిస్ తనది కాదు అన్న మాట ఇప్పటి వరకూ బాబు నోటి నుంచి వచ్చింది లేదు.
ఆ కేసుల విషయం పక్కనపెడితే ఈ రోజు కూడా కొన్ని అమూల్యమైన నీతి వాక్యాలు చెప్పాడు బాబు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోతుల్లా ప్రవర్తిస్తున్నారని, వాళ్ళ చేష్టలు చూస్తుంటే కంపరం కలుగుతోందని చెప్పాడు. అలాగే పేరు ప్రస్తావించకుండా వైసిపి ఎమ్మెల్యే రోజాని కూడా విమర్శించాడు. బాగుంది. బాబు చెప్పిన మాటలు నిజం కూడా. రోజాతో సహా వైసిపిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన అభ్యంతరకరంగానే ఉంది. అదే టైంలో……‘ఏరా…రేయ్….పాతేస్తా నా కొడకా…..’ అని టిడిపి ఎమ్మెల్యే వినిపించిన బూతుపురాణం కూడా ప్రజలు అసహ్యించుకునేలానే ఉంది. అలాగే జెసి దివాకర్‌రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలాంటి వాళ్ళ చేత జగన్‌ని బూతులు తిట్టించడం కూడా చంద్రబాబు స్థాయి నాయకుడికి భావ్యమేనా? ఈ రోజు కూడా ఆనంవారు రెచ్చిపోయారు. పేరు ప్రస్తావించకుండా రోజాని ‘బాసేలి’ అని తిట్టాడు. మహిళ పార్లమెంట్ సందర్భంగా స్త్రీల గురించి బాబు అండ్ కో చాలా గొప్పగా మాట్లాడిన మాటలు ఇంకా ఆ మహిళల ఆలోచనల్లో ఉండగానే……ఒక మహిళా ఎమ్మెల్యేను సదరు టిడిపి నేత ‘బాసేలి’ అని మీడియా కెమేరాల ముందు తిట్టాడు. బాగా మదం పట్టిన పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నాడని వైఎస్ జగన్‌ని తిట్టాడు ఆనం వివేకానందరెడ్డి.
రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. జగన్ అక్రమ సంపాదన గురించి ప్రజలకు ఎంతైనా చెప్పొచ్చు. కానీ విమర్శల స్థాయి దాటి వీధి రౌడీల భాషను టివి కెమేరాల ముందు మాట్లాడడం మాత్రం దిగజారుడుతనానికి పరాకాష్టలా ఉంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళ నుంచి….వాళ్ళను ఎన్నుకున్న ప్రజలు కాస్త హుందాతనాన్ని ఆశిస్తారు. పదిమందికీ ఆదర్శంగా ఉండకపోయినా ఫర్వాలేదు కానీ పదిమందీ అసహ్యించుకునేలా ఉంటే మాత్రం ఆ నాయకులను ప్రజలు మానసికంగా బహిష్కరిస్తారనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు…..దేశంలోనే నాకంటే అనుభవజ్ఙుడైన నేత లేడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు జమానాలో రాజకీయ నాయకుల మాటలు ఈ స్థాయికి దిగజారడం మాత్రం ఆయనకే చెడ్డపేరు తీసుకువస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా పుచ్చలపల్లి సుందరయ్యలాంటి నాయకులను చూశాను, ఇప్పటి నాయకులను చూస్తుంటే బాధేస్తుంది అని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు. మరి భవిష్యత్తరాల నాయకులు చంద్రబాబు కాలం నాటి రాజకీయాల గురించి, చంద్రబాబు చేస్తున్న రాజకీయాల గురించి గొప్పగా మాట్లాడుకోవాలా? లేక దిగజారుడుతనానికి ఉదాహరణగా చెప్పుకోవాలా? అన్నది ఇప్పటి బాబుగారి చేతలను బట్టే ఆధారపడి ఉంటుంది మరి. చాలా చాలా గొప్ప గొప్ప మాటలను, ఉదాహరణలను చెప్తూ ఉండే చంద్రబాబు…..చేతల్లో కూడా ఆ గొప్పతనాన్ని చూపించాలని కోరుకుందాం.