తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు జ్యూడిషియల్ విచారణకు ఆదేశించారు. ఆరుగురు చనిపోయిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, మానవతప్పిదమే ఎక్కువగా ఉందని చంద్రబాబు నిర్దారించారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పేనని స్పష్టం చేశారు. మొత్తం ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కమిషనర్ గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేశారు. అసలు తొక్కిసలాట ఘటనకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ రమణకుమార్ తో పాటు గోశాల ఇంచార్జ్ ని సస్పెండ్ చేశారు. జ్యూడిషియల్ విచారణ తర్వాత మిగిలిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ప్రకటించారు. టీటీడీ నిధుల నుంచి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా తీవ్ర గాయాలైన ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. లాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. 33 మంది క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం చేయిస్తామని ప్రకటించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
ఈ ఏడు నెలలకాలంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి దుర్ఘటన దొరికిందని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు.తమ శక్తి మేర ఆరోపణలు చేస్తూ.. మీడియాతో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నించారు. జగన్ కూడా ఆస్పత్రికి వచ్చి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించారు.