తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడకు మొదటినుంచి ఒక అలవాటుంది. అంతకంటే దాన్ని ఆందోళనలనడం సమజంసం.తనపైన తన ప్రభుత్వ పాలనపైన ఏదైనా విమర్శ వస్తే తట్టుకోలేకపోవడం, తర్జనభర్జన పడటం ఆయన లక్షణం. అలా అని చక్కదిద్దే చర్యలు తీసుకుంటారని కాదు. ముందు తమ వాళ్లను సమర్థించుకుని ఆ విమర్శలను ఎలా న్యూట్రలైజ్ చేయాలనేదానిపై వ్యూహం రూపొందిస్తారు. ఇందుకోసం మీడియా బృందాలనే ఏర్పాటు చేస్తారు. అయితే సోషల్ మీడియా విస్తరణ తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. లెక్కకు మిక్కుటంగా అనుక్షణం వస్తున్న పోస్టులలో రకరకాల వివాదాస్పద చవకబారు పద్ధతులు కూడా పెరిగిపోయిన నేపథ్యంలో వచ్చే ప్రతి విషయాన్ని తెలుసుకోవడం ఖండించడం నష్ట నివారణ పెద్ద సవాళ్లుగా తయారైనాయి. అందుకే సోషల్ మీడియాకు కూడా పలు హెచ్చరికలు చేశారు.ఒకరిని అరెస్టు కూడా చేశారు.ఆ సమయంలోనే నేను చెప్పాను – ఇలా దీన్ని కదలించడం ద్వారా సమస్య ఇంకా జటిలమవుతుందని. ఇప్పుడు జరుగుతున్నది అదే. దాంతో మరోసారి చంద్రబాబు పార్టీ వారిని సోషల్ మీడియాను జాగ్రత్తగా ఫాలో కావలని నొక్కి చెబుతున్నారు. అధికార హంగుదర్పాలు వున్నా టిడిపి ఈ విషయంలో విఫలమైందనే చెప్పాలి. మూడు నాలుగు మాసాల కిందటనే సోషల్‌మీడియా వర్క్‌షాప్ జరిపారు గాని వర్క్ జరిగింది లేదు. సిబ్బంది లేక నిధులు లేక వ్యక్తిగత ఆసక్తితో ఒకరిద్దరు నాయకులు మాత్రమే కామెంట్టు పోస్టు చేస్తుంటారు. అది కూడా ఎప్పుడూ జగన్ కేసులు దూకుడు వంటి అంశాలకే పరిమితమైతే అది నెగిటివ్ పబ్లిసిటీలా మారిపోతున్నదంటున్నారు. గతంలో లోకేశ్ ఆధ్వర్యంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన చాలా పరిమితంగా ప్రజల సమస్యలు తీసుకోవడానికే సరిపోతున్నదట. అక్కడున్న ఉద్యోగిని ప్లీజ్ సెండ్ ద డీటైల్స్ అని టెంప్లేట్ తరహాలో చెప్పేస్తుంటారని టిడిపి వర్గాల జోకు. అయినా తగు నిధులు లేకుండా సోషల్ మీడియా వింగ్ ఎలా విస్తరిస్తుందని వారి ప్రశ్న. ఇవీశ్రీన్న దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు సోషల్‌మీడియా పాలో కావాలని బద్దకం వదలిపెట్టాలని నాయకులను హెచ్చరించినట్టు కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో అరకొరగా చేస్తే మొదటికే మోసం తప్పదు.