జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈసారి అభిమానులను ఉద్దేశించి సుదీర్ఘంగా సందేశం ఇచ్చారు. అభిమానులు ఆవేశ పడొద్దన్నారు. జనసేనాని ఉద్దేశించి మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలు తెలిసినవే. ఈ నేపథ్యంలో పవన్… ‘అశోక్ జగపతి రాజుకి పవన్ కల్యాణ్ ఎవరో తెలీదు, మంత్రి పితానికి పవన్ కల్యాణ్ ఏంటో తెలీదు’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఈ అంశమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారనీ, ఇలాంటి విషయాల్లో నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం అన్నారట. మరి, ఆయన తీసిన ఆరా ఏంటనేది కాసేపు పక్కన పెడితే.. పితాని విమర్శల నేపథ్యంలో జనసేన కార్యకర్తలకు పవన్ తాజాగా సందేశం ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పార్టీ ముందుకు వెళ్తోందనీ, ఇలాంటి సందర్భంలో దృష్టినీ ఏకాగ్రతనీ మరల్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తారనీ, అలాంటి వారి విషయంలో ఎవ్వరూ ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని పవన్ విన్నవించారు. వ్యక్తిగతంగా తనపై ఎవ్వరు విమర్శలు చేసినా, అపకీర్తి తెచ్చేలా ఎవ్వరైనా వ్యవహరించినా వారి పట్ల హుందాగా ఉండాలని అభిమానులను పవన్ కోరారు. దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా… కుల మత ప్రాంత వర్గ విభేదాలకు అతీతంగా పార్టీ నిర్మాణం జరుగుతోందన్నారు. ఇటువంటి తరుణంలో వచ్చే విమర్శలకు ఆవేశం చెందొద్దన్నారు. మీ ఆవేశం పార్టీకి ఒక్కోసారి హాని చెయ్యొచ్చనీ, చేస్తున్న ప్రతీ విమర్శల్నీ పార్టీ లెక్కగడుతోందనీ, అవి హద్దులు మీరుతున్న సందర్భంలో సరైన సమయం చూసి పార్టీ స్పందిస్తుందని పవన్ కల్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. హుందాగా ఉండాలనీ, ఓర్పుతో వ్యహరించాలని పదేపదే కోరారు..!
పవన్ చేసిన సూచన బాగానే ఉంది! పార్టీ నిర్మాణంలో ఉంది కాబట్టి.. ఎలాంటి విమర్శలకూ స్పందించాల్సిన అవసరం లేదనీ, ఆవేశం వద్దని కార్యకర్తలకు చెప్పడం మంచిదే. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ నేతలకు దాదాపు ఇదే మాదిరిగా చెప్పడం ఇక్కడ గుర్తు చేసుకోవాలి! పితాని వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించినట్టూ… పవన్ ట్వీట్ పై ఆరా తీసినట్టూ… అంతేకాదు, అధిష్టానం అనుమతి లేకుండా నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని కాస్త ఘాటుగానే చెప్పినట్టు మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ పై విమర్శలు చెయ్యొద్దని నేతలతో చంద్రబాబు చెప్పారు. పవన్ అవసరం ఏంటో ఆయనకి తెలియంది కాదు కదా! కాస్త అటుఇటుగా.. తమపై వచ్చే విమర్శలపై స్పందించొద్దు అంటూ అభిమానులకు ఇవాళ్ల పవన్ చెప్పారు! అంటే, పవన్ ను విమర్శించొద్దని చంద్రబాబు నేతలకు పరోక్షంగా చెబితే… అలాంటి కామెంట్స్ విషయంలో ఆవేశానికి లోను కాకుండా ఉండాలని పవన్ చెప్పినట్టుగా అనిపిస్తోంది. పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందనలు కాకతాళీయంగా ఒకే అంశానికి ముడిపడి ఉండటం విశేషం.