టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేశారు. చాలా కాలం తర్వాత వీరిద్దరి మధ్య మాటలు జరిగాయి. విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటనలో ఏర్పడిన వివాదాలు.. పోలీసుల ఓవరాక్షన్.. వైసీపీ నేతల వ్యాఖ్యలు వంటి వాటిపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రబుత్వం పోరాడే విషయంలో ఇరువులు సలహాలు ఇచ్చి పుచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సమయంలో వీరి మధ్య ఫోన్ సంభాషణ వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది.
పవన్, చంద్రబాబు మాట్లాడుకునే సందర్భాన్ని వైసీపీనే సృష్టించినట్లయింది. పవన్ ఏం చేసినా చంద్రబాబు చెప్పినట్లుగానే.. చంద్రబాబు కోసమే చేస్తున్నట్లుగా విమర్శలు చేసే వైసీపీ నేతలకు.. ఇప్పుడు నేరుగా పవన్‌తో చంద్రబాబు మాట్లాడటం మరింత ఆనందం కలిగించవచ్చు. కానీ ఈ ఫోన్ కాల్ రాజకీయాల్లో కీలక మలుపు అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు విశాఖలో పరిణామాలపై సోషల్ మీడియాలోనూ స్పందించారు. పవన్‌కు మద్దతు తెలిపారు. లోకేష్ కూడా పవన్‌కు మద్దతు తెలిపారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో పోలీసుల తీరును ఎండగట్టారు. పవన్‌కు మద్దతుగా నిలిచారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండించారు. బీజేపీ కూడా పవన్‌కు మద్దతుగా ప్రకటనలు చేసింది. మొత్తంగా పవన్ కల్యాణ్ పర్యటన.. ఇంత కాలం కలవడానికి ఓ మార్గం వెదుక్కుటున్న బీజేపీ, జనసేన, టీడీపీలకు.. ఓ దారి చూపించినట్లయింది. దానికి వైసీపీనే కారణం అవడం .. యాధృచ్చికం కావొచ్చు.