తెలంగాణ రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం మార్మోగుతుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నవనిర్మాణ దీక్షనే మరో ఏడాది కొనసాగించింది. అక్కడ పరిస్థితి అది. కొత్తరాష్ట్రం కాదు గనక అవతరణ అనడానికి లేదు. ఆనందంగా జరుపుకునే వాతావరణం వుండదు. ఇక్కడున్నంత వూపూ ఉత్సాహం విజయాలు లేకపోవడం ఒకటైతే ా ప్రత్యేక హౌదా విషయంలో కేంద్రం తిరస్కరణను ఎదుర్కొన్న చంద్రబాబు సర్కారుకు ఇరకాట పరిస్థితి. కనుకనే రెండవ ఏడాది కూడా దీక్షపేరిట ఈ సందర్భాన్ని మరో విధమైన సంకేతాల కోసం ఉపయోగించుకోవడం కూడా వూహించుకోదగిన విషయం.
తెలంగాణతో పోలిస్తే విభజితాంధ్ర ప్రదేశ్ విషయంలో మరింత క్లిష్టమైన సమ్ణస్యలున్నాయి.కాని విభజిత రాష్ట్ర సమస్యలపై ఒక్కసారైనా అఖిలపక్షసమావేశం జరిపింది లేదు. వైఎస్ఆర్పార్టీ అంటే పడదు, మిగిలిన వారంటే లక్ష్యం లేదు. ఏతావాతా ఏకపక్షం అవుతుంది.. ఇలాటి సమయంలోనే ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చి లేనిపోని వివాదానికి కారకులైనారు. ఆయన విధానాలతో ఎంత తీవ్రంగా విభేదించేవారైనా సరే ఈ భాషను హర్షించరు. దీన్ని అవకాశంగా తీసుకుని తెలుగుదేశం నిరసన కార్యక్రమాలు తీవ్రం చేసింది.జగన్‌పై దాడికి వారికో అవకాశం చేతులారా ఇచ్చినట్టయింది. ఆ తర్వాత కూడా తన మాటలు సవరించుకునేబదులు జగన్ రెట్టించి చెబుతున్నారంటే ఆయన కూడా వ్యూహాత్మకంగానే అంటున్నారనుకోవాలి. ఇప్పటి వరకూ ప్రభుత్వ వైపల్యాలను రాజకీయాస్త్రాలుగా మలుచుకోవడంలో పెద్దగా సఫలం కాని జగన్ తనే అవతలివారికి ఆయుధాలు అందించడం అనుభవ రాహిత్యమా అహంభావ పలితమా అర్థం కాదు. జగన్‌కు నిరసనల సందర్భంలో తెలుగుదేశం కార్పొరేట్ మంటల్లో కాలిగాయపడటం ఒక అపశ్రుతి మాత్రమే గాక హెచ్చరిక కూడా. రాజ్యసభ ఎంపికపై ఉప ముఖ్యమంత్రి కెఇకృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ తమ పార్టీకే నిరసన తెల్పడం ప్రకాశం జిల్లాలోనూ పాత కొత్త నేతల అనుచరులు ఘర్షణ పడటం తెలుగుదేశంలోనూ పరిస్థితి బాగాలేదని చెబుతున్నాయి. మహానాడు వేదికపై చంద్రబాబుకే విసుగుతెప్పించిన ఆశావహులూ ‘అతి’రథులూ వున్నారు. మొత్తం రాజధానిపైనే కేంద్రీకృతం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆలోచనా సరళి అధికార పక్షంలో వారికే అంతుపట్టడం లేదు.రాష్ట్రాభివృద్ధి రాజధానితో ముడిపడివున్నదని మంత్రి నారాయణ అనడం ఈ ధోరణినే ప్రతిబింబిస్తున్నది. నిజానికి అక్కడ తొమ్మిది పథకాలు విదేశీ కంపెనీలకు అప్పగిస్తే ఒక్కటీ సకాలంలో సరసంగా పూర్తికాకపోవడం సవాలుగా వుంది. ప్రపంచబ్యాంకు ప్రవేశం, అర్థం కాని అప్పులూ, అడుగడుగునా కార్పొరేట్ విన్యాసాలు, వాటిని వ్యతిరేకించే ఉద్యమాలపై హక్కుల హరింపులూ, ముందస్తు అరెస్టులూ అన్నీ షరా మామూలే. కేంద్రంతో లేదా పొరుగు రాష్ట్రంతో జరిపే సంభాషణలు సంప్రదింపులపైనైనా వివరణ వుండదు. విదేశాల నుంచి ఏదో ఒరిగి పడుతుందనే భ్రమల వ్యాప్తి. పట్టిసీమ తప్ప మరే ప్రాజెక్టు గురించి పట్టించుకోని వైనం. కెసిఆర్ అంటున్నట్టు గోదావరి నదులు అపారంగా సముద్రంలో కలసిపోతున్నాయి గనక ప్రత్యామ్నాయాలను రూపొందించుకోవచ్చు. రాయలసీమకు చేర్చడానికి పథకాలు వేయొచ్చు. ఒక విభజన తర్వాతనైనా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతీయ అసమానతల తొలగింపునకు ప్రథమ ప్రాధాన్యతనివ్వని రాజకీయ పాక్షికత్వంపై ఆందోళనలు ఆరంబమైనాయి. ఒకవైపున నిధులకొరత అంటూనే మరోవైపున ప్రపంచంలో ప్రథమ స్థానం గురించిన ప్రజ్ఞలు చెబుతుంటే పొంతనలేకుండా పోతున్నది. అనుభవాన్ణి చూసి అధికారం అప్పగించిన ప్రజలకు అయోమయం. అమరావతి పక్ననే అలజడి అగుపిస్తున్నాయి. మొదలు కాని ఉద్యోగ నియామకాల కోసం యువత ఎదురు చూస్తున్నది. పాలక ప్రతిపక్షాల పెనుగులాటలో శాసనసభ సమావేశాలు మొక్కుబడులుగా ముగిసిపోతున్నాయి. ప్రచారార్భాటాలు ప్రదక్షిణాలూ ఎక్కువై ప్రజా ప్రయోజనాలు వెనక్కు పోతున్నాయి. కులాల చిచ్చు మళ్లీ రాజుకుంటున్నదనే అనుమానాలు పెరుగుతున్నాయి. మొన్న మహానాడులో రాజకీయ విమర్శలు దీనిచుట్టే తిరిగాయి. చిరంజీవి పేరు కూడా రంగంమీదకు వచ్చింది.
కాల్‌మనీ, ఇసుక దందాల వంటివాటిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో తమకు ఏం ఫర్వాలేదని కొందరు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. .అదేపనిగా భూములు సేకరించి అవసరం లేని విమనాశ్రయాలూ వినోద కేంద్రాల పేరిట వివాదాలు పెంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజధాని లేకపోవడం నిధుల కొరత నిజం కావచ్చు గాని ఆంధ్ర ప్రదేశ్ హఠాత్తుగా పుట్టుకోచ్చిన వ్యవస్థ కాదని ఒప్పుకోవాలి.
హైదరాబాదులో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా వుండేందుకు అవకాశమిస్తే పది నెలలు కాకుండానే పరుగులు తీయడం ప్రశ్నార్థకమైంది. గత మేనెలలో ఓటుకు నోటు తర్వాత ఇది జరగడంతో రాజకీయ కారణాల వల్లనేవెళ్లిపోయారన్న భావం పెరిగింది. తరలింపుపైనా తాత్కాలిక ఏర్పాట్టలపైన తడవకో తర్జనభర్జన. .ఇప్పుడు సచివాలయంలో కొన్నిబ్లాకులు కూడా స్వాధీనం చేస్తారనే కథలు వినిపిస్తున్నాయి. పాలన దగ్గరే వుండాలన్నది నిజమే గాని పదేళ్ల కాలాన్ని ఇంత త్వరగా వదులుకోవడమెందుకు? ముందు వెనక చూసి ఉడ్యోతులు అధికారులను విశ్వాసంలోకి త్ణీసుకుని నిర్ణయం Êప్రకటించవచ్చు కదా అని అడుగుతున్నారు. విభజనవల్ల కలిగిన సమస్యలకు తోడు ఈ హడావుడి అరకొర నిర్ణయాలు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన నాయకుడికి ఇవన్నీ బాగా అవగామనలోనే వుంటాయి. ఇప్పటికైనా దృష్టికోణం మార్చుకుంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతంది. భరోసా దొరుకుతుంది.