ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మార్పులూ చేర్పులూ ఉంటాయని ఎప్పట్నుంచో అనుకుంటూ వస్తున్నారు. కానీ, ఇంకా ముహూర్తం కుదరడం లేదు. అదిగో ఇదిగో అంటూనే రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు. ఇప్పట్లో మంత్రివర్గ మార్పులు ఉండవని దాదాపు స్పష్టమైపోయింది. అయితే, ఒక మంత్రి విషయంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకి ఉద్వాసన పలికేందుకు దాదాపు సిద్ధపడ్డట్టే అని కొంతమంది చెప్పుకుంటున్నారు. అయితే, ఆ మంత్రి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో… తన నిర్ణయంపై చంద్రబాబు మీనమేషాలు లెక్కపెడుతున్నారని కూడా వినిపిస్తోంది! తదనంతర పరిణామాలపై కొంత సందిగ్ధతకు లోనౌతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
నిజానికి, సదరు మంత్రికీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్కీ మధ్య గత కొద్దికాలంగా విభేదాలు ఉన్నాయట! దాంతో ఇద్దరి మధ్యా వివాదం చాపకింద నీరులా నెమ్మదిగా విస్తరించిందని చెబుతున్నారు. విషయం చంద్రబాబు నాయుడి వరకూ రావడంతో ఆయనకి ఉద్వాసన పలకాలని సీఎం నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే, ఆయన ఉద్వాసను ఆపేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది! ముఖ్యమంత్రికి సన్నిహితుడు.. ఆ మంత్రిగారికి వియ్యంకుడైన మరో మంత్రి రంగంలోకి దిగి, చంద్రబాబుతో ఇదే విషయమై పలుమార్లు మాట్లాడినట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. అయినాసరే, చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదట! ఎందుకంటే, సదరు మంత్రి నిర్వహిస్తున్న శాఖపై అవినీతి ఆరోపణలు ఎక్కువైపోయాయనీ, ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారన్న భావన చంద్రబాబుకు ఉందని చెబుతున్నారు.
అయితే, ప్రస్తుతం కాపు ఉద్యమం మరోసారి తెరమీదికి వస్తోంది. ఈనెల 16 నుంచి మరోసారి ముద్రగడ పద్మనాభం మళ్లీ ఉద్యమ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆ మంత్రిపై వేటు నిర్ణయం బయటకి వస్తే… అధికార పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు ఆగుతున్నారని తెలుస్తోంది. తన పదవికి గండం ఉందన్న సంగతి కూడా ఆ మంత్రికి తెలుసనీ,… ఆయన కూడా ప్రత్యామ్నాయ రాజకీయ ఏర్పాట్లలో ఉన్నారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఆ మంత్రి ఉద్వాసన వ్యవహారం ఆంధ్రా రాజకీయాల్లో కీలకమైన మలుపుగానే పరిణమించే అవకాశం ఉందని అంటున్నారు.