తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనకు లభించిన సమయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్కు వేసవి విడిది కోసం వెళ్లిన సీఎం… వచ్చే నెల రెండో తేదీ నుంచి కీలక కార్యాచరణ పెట్టుకున్నారు. మే 2 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి ఏకంగా 13 రోజుల పాటు జరగనున్నాయి. రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థులతో తొలుత చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 50 మంది చొప్పున.. ఏడు నియోజకవర్గాల నుంచి పిలిపించినవారితో చంద్రబాబు సమావేశం అవుతారు. పోలింగ్ సరళి, బూత్లవారీ లెక్కలు, నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడతారు.
మధ్యలో రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్ ప్రచారానికి వెళ్తారు. ఇప్పటికే… బూత్ల వారీగా వివరాలతో..ప్రత్యేకమైన నివేదికలు ఇవ్వాలని.. అభ్యర్థులందర్నీ చంద్రబాబు ఆదేశించారు. దానికి సంబంధించి అభ్యర్థులు కిందామీదా పడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ నివేదికల్లోనే… పార్టీ కోసం పని చేసిన వారెవరు అన్నదానిపై.. ప్రత్యేకమైన సమాచారం సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. రెండు, మూడు నెల్లోనే.. పంచాయతీ, జిల్లా,మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలన్నింటినీ… పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాత పాలనకు .. ఏ ఎన్నికలు అడ్డం రావన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో.. అధినేత ప్రమేయం స్వల్పమే.
కానీ ఈ సారి ఎన్నికల కోడ్ అంటూ.. ప్రభుత్వాన్ని పని చేయకుండా చేయడంతో.. పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పోస్టులకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పార్టీ కోసం పని చేసిన వారికి న్యాయం చేసేందుకు చంద్రబాబు ఈ సమీక్షలను ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది.