ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే విషయాలు చాలా మందికి ఇదెందుకుచెబుతున్నారు అనిపిస్తుంది. కానీ ఓ ముఖ్యమంత్రి ఆయన పని ఆయన చేయకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. సోమవారం తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని దాని కోసం చేయబోతున్నాననో ప్రకటించారు. బనకచర్లకు గోదావరి నీరు తరలించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
రాజకీయాల్లో ఇలాంటి సబ్జెక్టులు మాట్లాడటం అనేది ఓ డీగ్లామర్ వ్యవహారం. ఏ మీడియా పట్టించుకోదు. ఎవరూ హైలెట్ చేయరు.కానీ అలాంటి ప్రయత్నాలు బతకుల్ని మారుస్తాయని చెప్పక తప్పదు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3 వేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టడమే ఈ ప్రాజెక్టు చేపట్టడానికి ప్రాజెక్టును చంద్రబాబు సిద్దం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది.
మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం మొదటి దశ కాగా, రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలిస్తాము. మూడోదశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు నీటిని మళ్లించాలనేది చంద్రబాబు ప్లాన్. గోదావరి నీటిని కృష్ణా నదికి దాని నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలించి రాయలసీమ రతనాలసీమగా మార్చాలని అనుకుంటున్నారు. చంద్రబాబు మాటలు ఇప్పుడు వైరల్ కాకపోవచ్చు కానీ ఈ ప్రాజెక్టు సాకారం అయినప్పుడు కలిగే ప్రయోజనాలు మాత్రం ఆయనను ప్రతిక్షణం గుర్తు చేస్తాయన్నదాంట్లో సందేహం ఉండదు.