2014కి ముందు కూడా చంద్రబాబుకి ప్రచార యావ ఎక్కువే. తన డబ్బా తానే కొట్టుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడడు. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచీ మాత్రం ఆ భజన మరీ ఎక్కువైపోతోంది. చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడంలో తనకు ఒరిగేదేమీ లేదంటాడు. రాష్ట్రం అనాథ అయిపోకూడదు, రాష్ట్ర ప్రజలకు తనలాంటి అనుభవజ్ఙుడి అవసరం ఉందన్న ఉద్ధేశ్యంతోనే కష్టపడుతున్నానంటాడు. కానీ మరో పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా ఉండడం కోసం ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలన్న ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేస్తూ ఉంటాడు. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవడం కోసం కూడా ఎన్నో అడ్డదార్లు తొక్కడం, అక్రమాలు చేయడం చేస్తూ ఉంటాడు. అలాంటి బాబుకు అధికార యావ లేదంటే నమ్మేదెలా? కానీ బాబుగారు మాత్రం తనను నమ్మమని నమ్మకంగా చెప్తూ ఉంటాడు. తాను ఎంత గొప్పవాడు అన్న విషయాన్ని ప్రతిరోజూ ప్రజలకు వివరిస్తూ ఉంటాడు.
వయసు ఎక్కువ అవడంతో వచ్చిన ఛాదస్తమో ఏమో కానీ చంద్రబాబు స్వోత్కర్ష మరీ భరించలేని స్థాయికి వెళ్ళిపోతోంది. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వెళ్ళిన చంద్రబాబు…అక్కడ కూడా పీక్స్ అనే స్థాయిలో భజన మొదలెట్టాడు. పేదల కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అని చెప్పాడు. పేదల కోసం పనిచేస్తున్న ఏకైక హీరో బాలకృష్ణ అని కూడా చెప్పాడు. అంతటితో ఆగితే బాబు ఎందుకు అవుతాడు? ఆ బసవతారకం ఆస్పత్రి నిర్మాణం వెనకాల, బాలకృష్ణను ఛైర్మన్ని చేయడం వెనకాల తన అమూల్యమైన హస్తం ఉంది అనే అర్థం వచ్చేలా బోలెడన్ని మాటలు చెప్పాడు బాబు. అయినా మేమే గొప్పవాళ్ళం, మేమే సేవకులం, మాదే గొప్పతనం, మేమే హీరోలం అని తన భజన తానే చేసుకోవడం ఎందుకు? సోషల్ మీడియా జీవులకు తనను కమెడియన్ని చేసే అవకాశం ఇవ్వడం ఎందుకో?