టీడీపీ అధినేత చంద్రబాబు.. లోక్సభ ఎంపీ అభ్యర్థుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా… ప్రలోభాలకు, భయాలకు, బెదిరింపులకు లొంగకుండా ఉండేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో.. బలమైన అభ్యర్థులు అనుకున్న వారిని పక్కన పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. వారిని పార్టీలోనే ఉంచుకోవాలనుకుంటే.. అసెంబ్లీ సీటు ఆఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురకి నో చెప్పేశారు. ఈ జాబితాలో తాజాగా బాపట్ల ఎంపీ మాల్యాద్రి కూడా చేరారని చెబుతున్నారు.
రుణాల ఎగవేత, వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రఘురామకృష్ణంరాజు.. నర్సాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థి అవుతారు. అయితే ఆయనకు ఉన్న లింకులతో .. గెలిచిన తర్వాత ఏదైనా ఒత్తిళ్లు వస్తే సులువుగా లొంగిపోతారని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ ఉంటుందా ఉండదా.. అన్న పరిస్థితిని కల్పించారు. ఆయన పార్టీ నుంచి వెళ్లకపోయినా.. టిక్కెట్ ఇచ్చే వారు కాదన్న ప్రచారం టీడీపీలో సాగుతోంది. అలాగే.. సుజనా చౌదరికి.. బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి దగ్గర. ఆయనే గత ఎన్నికల్లో మాల్యాద్రికి టిక్కెట్ ఇప్పించారు. కానీ సుజనా పరిస్థితి అనుమానాస్పదంగా ఉంది. అందుకే.. ఈ సారి మాల్యాద్రికి బాపట్ల టిక్కెట్ లేదని క్లారిటీ ఇస్తున్నారు. ఇక పారిశ్రామిక వేత్తల విషయంలోనూ… చంద్రబాబు.. ఆచితూచి అడుగేస్తున్నారు. అందుకే.. ఎంపీ టిక్కెట్ల కోసం రేసులో ఉన్న పారిశ్రామికవేత్తలు.. తాము కేంద్రం నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గబోమని చెబుతున్నారు. పార్లమెంట్లో స్పీచ్ తర్వాత ఈడీ తనను వేధించిందని.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటన ఈ కోణం లోనిదే.
వచ్చే ఎన్నికల తర్వాత ఎంపీలు అత్యంత కీలకం అవుతారన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే.. పారిశ్రామికవేత్తలు అయినా.. కేసులు ఉన్న వాళ్లు అయినా.. ధైర్యం లేని వాళ్లు అయినా… ఎంపీలుగా అయితే.. సులువుగా లొంగిపోతారన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఈ సారి అలాంటి వాళ్లకు కాకుండా.. విధేయులకే.. ఆర్థిక బలం లేకపోయినా.. ఎంపీ టిక్కెట్లు ఇవ్వబోతున్నారరని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని టీడీపీ వర్గాలంటున్నాయి.