ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సంకేతాలు శనివారం నాటి కేబినెట్ భేటీ తర్వాత వచ్చాయి. ఉగాదితర్వాత జరుగుతుందని అనుకుంటున్న మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి చోటు దక్కుతుంది. తెలుగుదేశం పార్టీలోనే ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీలు అయిన వారు, తొలినుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎంతో మంది ఈ ఆరు స్థానాలపై ఆశలు పెంచుకుంటున్నారు. అలాంటినేపథ్యంలో కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్‌నుంచి వచ్చిన వారికి కూడా కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయవాడ వైకాపా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ఒక రకంగా మంత్రిపదవి ఖరారు అయినట్లే. వైకాపా నుంచి జంప్ చేసి, సొంత పార్టీలో ఎన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా కేబినెట్ భాగ్యాన్ని దక్కించుకోగల వారు ఇంకా ఎవరెవరు ఉన్నారనేదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది.
తెలంగాణలో కేబినెట్లో ఎందరికి అవకాశం ఉన్నదో అన్ని స్థానాలను కేసీఆర్ ఎన్నడో భర్తీ చేసేశారు. అదే చంద్రబాబునాయుడు మాత్రం భిన్నమైన వ్యూహం అనుసరించారు. ఏపీలో 18 స్థానాలకు అవకాశం ఉంటే ఆరు ఖాళీగానే ఉంచారు. ఎమ్మెల్సీలు కాగల నాయకులకు, జంప్‌చేసి తమ పార్టీలో చేరగల వైకాపా ఎమ్మెల్యేలకు ఆయన ముందుగానే ఖాళీలు ప్లాన్‌చేసి ఉంచారన్నమాట! ఇప్పటికీ ఆ ఆరు ఖాళీలు అలాగే ఉన్నాయి.
అయితే తెదేపా నాయకుల్లో మంత్రి పదవికోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇలా అనేక మంది ఉన్నారు. అదే సమయంలో వైకాపా నుంచి వచ్చిన వారిలో భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ తదితరులు కూడా అదేస్థాయి సీనియర్లే. అయితే స్థానిక జిల్లా, కుల, వర్గ సమీకరణల దృష్ట్యా కొత్త వారికి చోటు కల్పించేప్పుడు పాతవారిని కొందరిని తొలగించడం తప్పకపోవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది.
మంత్రిపదవులనుంచి తొలగింపుల కంటె శాఖల మార్పు ఎక్కువగా ఉంటుందని కూడా అనుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటిదాకా తెలుగుదేశంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీ కూడా లేకపోవడంతో వైకాపానుంచి వచ్చిన జలీల్‌ఖాన్‌కు మంత్రిపదవి ఖరారైనట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఇండైరక్టుగా ప్రకటించారు. త్వరలో మీరు ముస్లిం మంత్రిని చూస్తారు అని ఆయన వెల్లడించారు. ఇది జలీల్కే అని ఊహలు నడుస్తున్నాయి. వైకాపానుంచి వచ్చిన వారిలో ఇంకా ఎవరు అదృష్టవంతులో వేచిచూడాలి.