తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ మన జీవితాల్లో గొప్ప మార్పులకు స్వర్గీయ ఎన్టీఆర్ నాంది పలికారంటూ గుర్తుచేశారు. అలాంటి మహానాయకుడికి కూడా కొన్ని అపజయాలు ఎదురయ్యాయనీ, అయినా ఎప్పుడూ మనోనిబ్బరం కోల్పోలేదని అన్నారు. ఆయన ఇచ్చిన ఆత్మ గౌరవ నినాదంతో ముందుకు వెళ్లేందుకు ప్రతీ తెలుగుదేశం కార్యకర్తా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉంటూ, త్యాగాలు చేస్తూ, కష్టాలను ఎదుర్కొన్న సమయంలో కూడా పార్టీ జెండా వదలని కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదానాలు తెలియజేస్తున్నా అన్నారు.
గడచిన నాలుగైదు రోజులుగా తనను చాలామంది కలుస్తున్నారనీ, తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారనీ, కొంతమంది చాలా బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఒకే మాట చెప్తున్నాననీ… మూడున్నర దశాబ్దాలుగా మీకు అండగా ఉన్నాననీ, మళ్లీ అండగా ఉంటా ఎవ్వరూ అధైర్యపడొద్దని అన్నారు. కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా రాష్ట్రం కోసం పనిచేశాననీ, ఇప్పుడూ అదే చేస్తానని చెప్పారు. జీవితంలో ఇబ్బందులు అనేవి వచ్చి పోతుంటాయన్నారు. ఎన్నికలు అయిన తరువాత చాలా విషయాలు చర్చించుకుంటున్నామనీ, కార్యకర్తలూ నాయకులూ నిర్మొహమాటంగా అభిప్రాయాలు తెలియజేస్తున్నారన్నారు. ఒక నాయకుడిగా అన్నీ అధ్యయం చేస్తానని అన్నారు.
కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, వారికి కొంత సమయం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అన్నారు. వారు కొన్ని అంశాలు ప్రజలకు చెప్పారనీ, ఏమేం చేస్తారో చేయనీయండన్నారు. మనం కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా సహకరిద్దామన్నారు. టీడీపీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయనీ, అంటే ప్రతీ వందమందిలో నలభై మంది టీడీపీతో ఉన్నారన్నారు. వారికి అండగా ఉంటూ సేవలందించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయి నుంచీ లోపాలపై అందరూ సమీక్షించుకుందామనీ, ఎవరి స్థాయిలో గుర్తించిన లోపాలను వారు కరెక్ట్ చేసుకునే విధంగా ముందుకు సాగుదామన్నారు. ప్రజల కోసం మరోసారి అంకిత భావంతో పనిచేసేందుకు ప్రతీ ఒక్క కార్యకర్తా ముందుకు రావాలని కోరారు. ఎన్నికల ఫలితాల తరువాత డీలా పడ్డ టీడీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తొలిసారి కొంత హోప్ ఇచ్చే విధంగా మాట్లాడరని చెప్పొచ్చు.