ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్రికెట్ టీం వంటి తన బృందంతో కలిసి దేశావిదేశాలు చుట్టేస్తున్నారు. అక్కడ ఆయన చూస్తున్నవన్నీ అమరావతిలోనో లేదా రాష్ట్రంలోనో ఏర్పాటు చేసేయాలన్నట్లు మాట్లాడుతుంటారు. ఆ మద్యన ఏదో దేశానికి వెళ్లినప్పుడు అక్కడ అమ్యూజ్ మెంట్ పార్కులను చూసి వైజాగ్ లో ఒకటి స్థాపించేద్దామని ప్రతిపాదన చేశారు. దాని గురించి మీడియాలో బోలెడు వార్తలు వ్రాసుకొని కాలక్షేపం జరిగిపోయింది. అంతటితో అది సరి. ఆ తరువాత జపాన్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న ఆటోమేటిక్ విద్యుత్ నియంత్రణ మరియు సరఫరా వ్యవస్థని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. దాని సంగతి ఏమయిందో ఎవరికీ తెలియదు.
కొన్ని రోజుల క్రితం చైనా వెళ్లి బుల్లెట్ రైల్లో ప్రయాణించి, దాని పక్కన నిలబడి ఫోటోలు దిగి అమరావతి నుంచి హైదరాబాద్ కి బుల్లెట్ రైలు వేస్తే ఎలాగ ఉంటుంది? అని ఆలోచించినట్లు మీడియాకి లీకులు ఇచ్చారు. దానితో మళ్ళీ మీడియాకి మళ్ళీ చేతి నిండా పని దొరికింది. మెట్రో రైలుకే ఆపసోపాలు పడుతున్నప్పుడు బుల్లెట్ రైలు గురించి ఆలోచించడం అంటే ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురతానన్నట్లు ఉందని ప్రతిపక్షాలు నవ్వుకొన్నాయి.
తరచూ సింగపూర్ వెళ్లి వస్తున్న కారణంగా అమరావతిని సింగపూర్ లాగ కట్టేసుకొందామని చెప్పారు. వీలైతే డల్లాస్ కట్టేసుకొందామని ఆలోచించారు. ఇప్పుడు కజకిస్తాన్ రాజధాని ఆస్తానా నగరం మీద మోజు పడ్డారు. అలాగే కట్టేసుకొంటే పోలా..? అనుకొంటున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు అస్తానా టు గన్నవరం డైరెక్ట్ ఫ్లైట్స్ వేయాలని అభ్యర్ధించినట్లు మరో మాట కూడా వినబడింది.
ఆ తరువాత చంద్రబాబు నాయుడు టీం ఏ ప్యారిస్, లండన్ పర్యటనలకో వెళితే గన్నవరంలో ఈఫిల్ టవర్, బిగ్ బెన్ గడియారమో లేదా టవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతారేమో? ఈ ఆలోచనలతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ తరువాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఆయన ఏమి సిన్మా చూపిస్తారో?