దేశంలోనే ప్రముఖ నగరంలో పేరు ఉన్నప్పటికీ విజయవాడ అనుకున్నంతగా విస్తరించడం లేదు. దీనికి కారణం మౌలిక సదుపాయాలే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో మౌలిక సదుపాయాలు పెంచే లక్ష్యంతో తూర్పు బైపాస్‌ను ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్రవేయడంతో అతి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తన 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 12,029 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. చిన్న అవుటపల్లి నుంచి కాజ వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్ కు అభిముఖంగా తూర్పు బైపాస్ ను ఎన్ హెచ్ఏఐ నిర్మిస్తోంది. 50 కిలోమీటర్ల మేర ఈ బైపాస్ ను నిర్మించబోతున్నారు. ఈ బైపాస్ కు రూ. 2,716 కోట్లు కేటాయించారు.
దీని వల్ల విజయవాడ నగరం మరింత ఎక్కువగా విస్తరించడానికి అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత నగరం ఎంత వేగంగా విస్తరించిందో విజయవడా కూడా అలా మెట్రో సిటీ రేంజ్ లో .. బైపాస్ చుట్టూ విస్తరించే అవకాశం ఉంది. ప్రైవేటు పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ పెరిగితే ఆటోమేటిక్ గా.. ఆర్థిక వ్యవహారాలూ ఊపందుకుంటాయి.