నంద్యాల నియోజకవర్గం ఆ చుట్టుపక్కల ప్రజలు శోభన్‌బాబు-శారద నటించిన ‘శారద’ చిత్రంలోని పై పాట పల్లవి పాడుకున్నారట శనివారం నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కొందరు అడ్డుతగిలి సమస్యలు చెప్పడమో లేక సవాళ్లు చేయడమో జరిగిందట. నాయకుల పర్యటనల్లో అందులోనూ ఉప ఎన్నికల కురుక్షేత్రంగా మారిన మార్చిన చోట ఇలా జరగడం పెద్ద ఆశ్చర్యం లేదు. యాలూరు అనే వూళ్లో కరెంటు రావడం లేదని, ఇంకా ఏవో సమస్యలు చెప్పడంతో చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహౌదగ్రులైనారు. మీరు వైసీపీ వారు కదా..ఏ మయ్యా వైసీపీ వారే కదా అంటూ తమాషాగా వుందా పిచ్చి పట్టిందా అని పదే పదే వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుడుగా ముఖ్యమంత్రిగా వస్తే జగన్మోహనరెడ్ది తాగించి పంపించారని ఒకటికి రెండు సార్లు కోపంగా తిట్టిపోశారు. ముఖ్యమంత్రి కోపానికి స్పందనకు పక్కనున్న యువమంత్రి అఖిలప్రియ కూడా కాస్సేపు ఏమీ తోచనట్టు చూస్తుండిపోయారు. ఆ తర్వాతనే ఆమె,మేనమామ ఎంఎల్ఎ ఎస్విమోహనరెడ్డి కాస్త నవ్వుతూ కవర్ చేయడానికి ప్రయత్నించారు. అప్పటికి తన కోపం బాగా ఎక్కువైందని గ్రహించిన చంద్రబాబు కాస్త సర్దుకుని రేపు కలెక్టర్‌ను అధికారులను పంపిస్తాను. విచారిస్తారు. తప్పయితే నీపైన కేసు పెట్టిస్తా అని మరోదఫా కోపం చూపించారు. ప్రశ్నించిన వారి సంగతి అలా వుంచి ప్రభుత్వాధినేత ఇంతగా కోప్పడటం అందులోనూ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి మామూలు మనుషులపై అంతగా మండిపడటం అందరినీ ఆశ్చర్య పర్చడమే గాక అభ్యంతరకరంగా మారింది. అధికార కార్యక్రమాన్ని ఉప ఎన్నికల ప్రచారానికి వాడుకోవడమే ఒక పొరబాటు కాగా ప్రత్యర్థులను పేరు తీసి విమర్శించడం కేసుల వరకూ వెళ్లడం ఇంకా విపరీతం. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి వేదికపై లేకున్నా ముందువరసలోనే కూచుని ముఖ్యమంత్రి మాట్లాడగానే లేచి నుంచుని ఓట్ల నమస్కారాలు పెడుతూ ప్రచారం చేసుకోవడం కనిపించింది. అన్నట్టు వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డి సోదరుడు టిడిపి ఎంఎల్‌సి శిల్పా చక్రపాణి రడ్డి ఈ పర్యటనలో కనిపించలేదట.