ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల శాసనమండలి సమావేశాల చివరి రోజున తన వివాహం, రాజకీయ జీవితం పరిపాలన తదితర విషయాలను ముచ్చటించారు. ఆయన కొద్దిసేపు ఉద్దేగానికి గురైనారని కూడా మీడియా నివేదించింది. శాసనసభ రసాభాసగా వాయిదా పడింది గనక మండలిని ఎంచుకున్నారనుకోవాలి. ఇవే హైదరాబాదులో చివరి సమావేశాలని ఆయన ప్రకటించారు గనక .ఇలాటి సమయంలో వ్యక్తిగత జ్ఞాపకాలు అనుభవాలు కలబోసుకోవడం మంచిదే. ఎప్పుడూ వ్యవహార సరళిలో వుండే చంద్రబాబు వంటి నాయకుడు మానవీయ కోణంలో మాట్లాడ్డం బాగానే వుంది. ఎంతలేదన్నా ఆంధ్ర ప్రదేశ్‌ను తీసుకుంటే ఆయనది అరుదైన రికార్డు.అందులో నాటకీయ మలుపులూ కుదుపులూ ఆభియోగాలూ అగ్రహాలూ ఆవేదనలూ అన్నీ వున్నాయి. పుష్కర కాలం ముఖ్యమంత్రి, దశాబ్ది కాలం ప్రతిపక్ష నేత. అదే విధంగా దేశంలోనే రికార్డు స్థాయిలో ప్రాధాన్యత నిలబెట్టుకున్న నేతల్లో ఆయన ఒకరు.. ఇంత గతాన్ని చెప్పుకున్నప్పుడు కొన్ని వాస్తవ విజయాలు కొన్ని అతిశయోక్తులూ వుండొచ్చు. కాని చంద్రబాబు చెప్పిన వాటిలో కొన్ని రాజకీయ సందర్భాలు వివాదాస్పదమైనాయి.
చంద్రబాబుకు సన్నిహితుడూ, ఉలుకూ పలుకూ అంటునే ఉలిని పెద్దగా వాడని సంపాదకుడు ఐ.వెంకట్రావు రాసిన అ(న)ధికార జీవిత చరిత్ర ఒక్కడు దీనిపై ఏం చెబుతుంది? ఇంకా ఆనాటి విషయాలపై ఇప్పటి వైసీపీనేత నాడు టిడిపిసీనియర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ తొలి ప్రధాన కార్యదర్శి పి.ఉపేంద్ర, చంద్రబాబు తోడల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు రాసిన పుస్తకాలున్నాయి.పాత్రికేయుల కథనాలూ వున్నాయి. తొలి కో పైలెట్ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా ఆత్మకథ ప్రకటించారు. వీటి మధ్య తేడాలూ చూస్తుంటే తమాషాగా వుంటుంది. నేను ఐవిఆర్ రాసిన ఒక్కడు ప్రధాన ఆధారంగా తీసుకుని చంద్రబాబు చెప్పిన విషయాలు పోల్చి చూశాను.
- 1.తెలుగుదేశం ఏర్పడిన పరిస్థితులు , సంచలనాలు ఐవిఆర్ చాలా విపులంగా రాశారు. చంద్రబాబు స్వయం కృషితో పైకి రావడం, మంత్రి కావడం, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం వంటివన్నీ రాశారు. కాని పార్టీ పెట్టాలని చంద్రబాబు నాయుడే సలహా ఇచ్చారని చెప్పలేదు. మరి చంద్రబాబు ఆ విషయం ఐవిఆర్తో పంచుకోలేదా? దగ్గుబాటి కూడా మొదట్లో చంద్రబాబుకు మామ పార్టీ పెట్టడం ఇష్టం లేదని తనువెళితే కోప్పడి చాలా మాటలు అన్నారని రాశారు. ఇక నాదెండ్ల కూడా తనే సలహా ఇచ్చానని చెబుతుంటారు. ఇవన్నీ వింటే అంతటి ప్రజా నేతకూ మహాకళాకారుడికి తనదైన ఆలోచనలే లేవా అని సందేహం కూడా వేస్తుంది.
- 2. ఎన్టీఆర్ అల్లుడు కావడం వల్ల చంద్రబాబుకు గ్లామర్ వచ్చిందని అండ లభించిందని ఐవిఆర్ రాశారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల వివాదం సందర్బంలో చర్యకు గురైన చంద్రబాబు తరపున ఎన్టీఆర్ అమితాబ్ బచన్తో మాట్లాడి ఇందిరాగాంధీకి చెప్పించారని రామమూర్తి నాయుడు చెప్పినట్టు రాశారు. కనుక అల్లుడదది కెరీర్‌కు అప్పటినుంచే తోడ్పడ్డారన్నమాట.
- 3.తెలుగుదేశంలోకి రావద్దని మామే తనను వారించారని చంద్రబాబు చెప్పింది నిజం కాకపోవచ్చని ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ రాశారు. అయితే ఈ పుస్తకంలో ఐవిఆర్కూడా అదే రాశారు. (పుస్తకానికి సహకరించిన వారిలో అమర్ కూడా వున్నారు)
- 4.చంద్రబాబు సంగతి ఏమో గాని దగ్గుబాటి గురించి మాత్రం ఎన్టీఆర్ తొలినాళ్లలో విజయవాడ పత్రికా గోష్టిలో బహిరంగంగానే ఆ మాట అన్నారు.పార్టీలో అల్లుడి పాత్ర గురించి ఫ్రశ్న వచ్చింది. తను డాక్టర్, ఎందుకీ లేనిపోని తలనొప్పి అని నేనే వద్దంటున్నాను అని ఆయన విలేకరులతో అన్నారు. అయినా పార్టీకి ఇంకా నిధి కోశాధికారి లేరని కనుక ఎవరో పెత్తనం చేయడం ఎలా జరుగుతుందని ఎదురు ప్రశ్న వేశారు. అద్యక్షుడుగా తనే అప్పటికి అకౌంట్లు చూసుకుంటున్నానని, తర్వాత కమిటీ ఏర్పడుతుందని చెప్పారు. అయితే దగ్గుబాటి యువ జనతాలో వున్నారు. చంద్రబాబును కూడా రిస్కు తీసుకోవద్దని మామగా చెప్పే వుంటారనుకోవచ్చు.
- 5. హైకమాండ్ ఆదేశిస్తే ఎన్టీఆర్పైనైనా పోటీ చేస్తానని తాను అనలేదని మొన్న ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఐవిఆర్ పుస్తకంలోనూ ఆ విషయం చాలా స్పష్టంగా వుంది. తెలుగుదేశం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌లో చంద్రబాబుపై విశ్వాసం సన్నగిల్లింది. ఎప్పటికప్పుడు విధేయత రుజువు చేసుకోవలసిన పరిస్థితి. ఆ దశలోనే ఒకసారి కాంగ్రెస్ అధిష్టానవర్గం గుడివాడ నుంచి ఎన్టీఆర్‌పై పోటీ చేయమని ఆదేశిస్తే మీరేమి చేస్తారని ఒకరు ప్రశ్నించారు. హైకమాండ్ ఆదేశిస్తే ఏం చేయగలను? పోటీ చేస్తానని చంద్రబాబు సమాదానం ఇచ్చారట. ఇది ఐవిఆర్ రాసింది. మరుసటి రోజు పత్రికలలో ఎన్టీఆర్‌పై పోటీకి చంద్రబాబు సై అనీ, మామా అల్లుళ్ల సవాల్ అనీ, ఢ అని రకరకాలుగా వార్తలు వ్యాఖ్యలు వచ్చి ఇబ్బంది పెట్టాయని స్పష్టంగా రాశారు.
చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ కావడం ప్రధాని అయ్యే అవకాశం ఎలా వచ్చాయి? ఏం జరిగింది? ఇందుకు సంబంధించి ఐవిఆర్ రాసిన దాంట్లో నిజానిజాలేమిటి? రాయనిదేమిటి? ఈ విషయాలు మరోసారి చూద్దాం.