జగన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఏం జరిగిందో అందరూ చూశారు. ఆ విధ్వంసం కళ్ల ముందే ఉంది.కానీ డేటా రూపంలో చూస్తే .. అర్థం చేసుకున్న వారికి మరింత మైండ్ బ్లాంక్ అవుతుంది. దానికి నీతి ఆయోగ్ నివేదికే సాక్ష్యం. చంద్రబాబు దాన్ని ప్రజల ముందు పెట్టారు. ఎంత మందికి అర్థం అవుతుందో .. ఎంత మంది దాన్ని పట్టించుకుంటారన్నది పక్కన పెడితే..ఓ వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేశారన్నది నిజం. అయితే చంద్రబాబు ఇప్పుడు ఆ కారణంగా సూపర్ సిక్స్ విషయంలో వెనుకడుగు వేయలేని పరిస్థితి ఉంది.
అప్పులు చేసి పథకాలు అమలు చేయడం అనే విధానానికి చంద్రబాబు వ్యతిరేకం. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఆస్తులను సృష్టించాలన్నది ఆయన విధానం. కానీ ఇప్పుడు మరో మార్గం లేదు. సూపర్ సిక్స్ లో రెండు అత్యంత కీలక పథకాలు.. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ రెండు పథకాలను ముందుగా అమలు చేస్తే..ఇతర వాటి విషయంలో సమయం తీసుకున్నా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. జగన్ చేసింది విధ్వంసమే కారణంగా ఆ కారణం.. ఇవ్వలేకపోతున్నామని చెప్పడాన్ని ప్రజలు హర్షించరు.అందుకే చంద్రబాబు .. అప్పులు చేసైనా ఇస్తామని అంటున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. జగన్ చేస్తున్న అప్పులపై ఓ స్పష్టత ఎన్నికలకు ముందే ఉంది. అలాంటి సమయంలో .. పథకాలను ప్రకటించకుండా ఉండాల్సింది. రాష్ట్రాన్ని చక్కదిద్దుతానని అవసరమైన వారికి మాత్రం అందాల్సిన ఖచ్చితమైన సంక్షేమాన్ని మాత్రమే ఇస్తానని ప్రకటించి ఉంటే.. ప్రజలు అర్థం చేసుకునేవారన్న అభిప్రాయం. కూటమి ఇచ్చిన మేనిఫెస్టోను చూసి ఓట్లు వేసినవారు తక్కువ. అరాచక పాలన పోవాలని కోరుకున్న వారు ఎక్కువ. కానీ గెలిచి తీరాలి లేకపోతే.. రాష్ట్రం అడ్రస్ లేకుండా పోతుందన్న భయంతో భారీ హామీలిచ్చారు. ఇప్పుడు మోసి తీరాల్సిందే.