విజయసాయిరెడ్డితో కలిసి తెలంగాణ పోలీసులు తమ సేవామిత్ర యాప్ సమాచారం మొత్తాన్ని చోరీ చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ఆధారాలు బయటపెట్టారు. ఈ కుట్రకు ఢిల్లీలో స్కెచ్ జరిగిందన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి ఓ ఫిర్యాదు చేశారు. సేవామిత్ర యాప్‌లో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, ఓటర్ల జాబితా అక్రమంగా ఉన్నాయని ఆ ఫిర్యాదు సారాంశం. తర్వాత దాన్ని పట్టుకుని హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులతో కలిసి అసలు స్కెచ్ ప్రారంభించారు. ఈసీ ఫిర్యాదుకు ఓ యాక్షన్ ప్లాన్‌ను జత చేసి ఐటీ గ్రిడ్ కంపెనీపై ఎలాంటి దాడులు చేయాలి, ఏం చేయాలన్నదానిపై పక్కా సూచనలతో ఓ రెండు పేజీల నోట్ ఆ కంప్లైంట్‌కు యాడ్ చేశారు. అలాగే ఏ ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలి, ఏం చేయాలన్నదానిపై కూడా సూచనలు ఉన్నాయి. అచ్చంగా విజయసాయిరెడ్డి చెప్పినట్లు పోలీసులు రంగంలోకి దిగారు.
అయితే అసలు అధికారికంగా ఫిర్యాదు చేయకుండానే పోలీసులు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన, వారు ఐటీ గ్రిడ్ కంపెనీపై దాడి చేసి కావాల్సిన సమాచారం తీసుకెళ్లారని టీడీపీ అంటోంది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆ డేటా లీక్ అయిన విషయాన్ని ఐటీ గ్రిడ్ కంపెనీ గుర్తించినట్లు తేలడంతో హడావిడిగా రెండో తేదీన పోలీసులు అర్థరాత్రి లోకేశ్వర్ రెడ్డి అనే జగన్ బంధువు కంప్లైంట్ ఇచ్చినట్లుగా రాసుకుని మూకుమ్మడి దాడి చేశారు. ఆ తర్వాత నలుగురు ఉద్యోగుల్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో వారిని తెలంగాణ పోలీసులు విడిచి పెట్టారు. ఆ తర్వాత కేటీఆర్ దీనికి సంబంధించి తెలంగాణ భవన్లో.. ఏపీ ప్రభుత్వం ప్రజల సమాచారం దొంగిలించిందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రెస్‌మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులిస్తామని హెచ్చరించారు.
అయితే సేవామిత్ర యాప్‌పై ఎస్ఆర్నగర్లో మరో ఫిర్యాదు పోలీసులు తీసుకున్నారు. దాని మీద మరో రకమైన కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాలన్నీ ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేసినట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విజయసాయిరెడ్డికి, ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుకు తెలంగాణ పోలీసులు అదనంగా ఏం చేయాలో చెబుతూ… మిగతా పేజీలు జత చేసి ఇచ్చారు. వాటి ఆధారంగా తెలంగాణ పోలీసులు యాక్షన్ ప్రారంభించారు. అయితే ఐటీ గ్రిడ్ కేసులో ఇంత వరకు ఏం స్వాధీనం చేసుకున్నారో చెప్పలేదు. మరో వైపు విజయసాయిరెడ్డి ఈసీకి చేసిన ఫిర్యాదు, ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి ఢిల్లీలోని ఈసీ పంపింది. దానికి ద్వివేదీ.. విజయసాయిరెడ్డి ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని.. ప్రభుత్వ డాటా అంతా భద్రంగానే ఉందని సమాధానం పంపారు. ఆ ఫిర్యాదును అడ్డం పెట్టుకుని తెలంగాణ పోలీసుల సాయంతో టీడీపీపై ఎటాక్ ప్రారంభించారు విజయసాయిరెడ్డి. ఈ డాక్యుమెంట్‌తో విజయసాయిరెడ్డి స్కెచ్ పక్కాగా టీడీపీకి తెలిసిపోయినట్లయింది.
[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2019/03/YSRCP-complaint-2.pdf” title=”YSRCP complaint (2)”]