ఆనాడు విభజన సమయంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టిందెవరు.. భాజపా! అధికారంలోకి వచ్చాక హోదా కుదరదనీ, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులనీ, ఇతర రాష్ట్రాల డిమాండ్లనీ రకరకాల కారణాలు చెప్పి హోదాను కనుమరుగు చేసిందెవరు.. అదీ భాజపా! ప్రత్యేక ప్యాకేజీ ఒక అద్భుతం అనీ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సమూలంగా మార్చేసే పరుశవేది అని గొప్పలు చెప్పిందెవరు.. సాక్షాత్తూ వారే. ఇలా చెబుతూ చెబుతూ కేంద్రం నుంచి ఆంధ్రాకు దక్కాల్సిన ప్రయోజనాలను తగ్గిస్తూ వచ్చారు. ఇది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. అయితే, అన్నీ జరిగిపోయాక.. హోదా అనే కాన్సెప్ట్ సమూలంగా తీసేశాక, దాని గురించి గొప్పగా చెబితే ఎలా ఉంటుంది..? సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే దానిపై ఇప్పుడు స్పందిస్తే ఎలా ఉంటుంది..? తాజాగా విజయవాడలో ఆయన అదే పనిచేశారు.
విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గట్కరీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. చంద్రబాబు, వెంకయ్య ఒకే వేదిక మీద ఉంటే పరస్పర ప్రశంసా పర్వం అనేది ఒకటి ఉంటుంది కదా! ఇక్కడ కూడా అదే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… కేంద్రమంత్రిగా ఉండగా వెంకయ్య నాయుడు చేసిన కృషిని మరోసారి మెచ్చుకున్నారు. ‘రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లేదు. ఆరోజు గౌరవనీయులైన వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఉండి, ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడం కోసం సాయశక్తులా పనిచేశారు. ఆరోజు స్పెషల్ స్టేటస్ లేకపోయినా.. దాన్ని పెట్టారంటే, అది వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ చూపించిన చొరవ. అది వారి కష్టార్జితం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. వెంకయ్య నాయుడు ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ భాగస్వాములయ్యారు. రాష్ట్రానికి అన్యాయం జరక్కూడదని ఆరోజు పోరాడిన వ్యక్తం. న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి’ అంటూ చంద్రబాబు ప్రసంగంలో చెప్పారు.
నిజమే… ప్రత్యేక హోదా వారి కష్టార్జితమే కాసేపు అనుకుందాం. ఆ కష్టార్జన ఎవరికి ఉపయోగపడింది..? ప్రత్యేక హోదా నిజంగా ఏపీకి తెచ్చి ఉంటే… పడిన కష్టానికి గుర్తింపు లభించేది. ఆంధ్రాకు అన్యాయం జరిగిన ప్రతీసారీ వెంకయ్య పోరాటం చేశారట! మరి, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఇవ్వకుండా భాజపా మాట తప్పడం అన్యాయమా కాదా..? హోదాకు సమానమైన ప్యాకేజీ అన్నారేగానీ… ఆ తత్సమాన ప్రయోజనాలేంటనేవి టీడీపీ సర్కారూ చెప్పలేకపోతోంది. ఈ అన్యాయంపై పోరాటం చేశారా..? కేంద్రం నుంచి నిధులు సకాలంలో రావడం లేదు, రెవెన్యూ లోటు తీర్చాల్సి ఉంది, విశాఖ రైల్వే జోన్ మనకు రావాల్సి ఉంది, పోలవరం ప్రాజెక్టు బిల్లులు ఆమోదించాల్సి ఉంది.. అని మొన్నటికి మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇవేవీ ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయాలు కావా అనేదే అసలు ప్రశ్న..? ఈ విషయాలేవీ చంద్రబాబు ఇక్కడ ప్రస్థావించలేదు. ఎప్పుడో రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టడమే వారి కష్టార్జితం అన్నట్టుగా ఇప్పుడు చెబితే సరిపోతుందా..? ఆ హోదా కార్యరూపం దాల్చకుండా మతలబు చేసిన కేంద్రంపై వెంకయ్య చేసిన పోరాటం ఏదీ..? అయినా, ప్రత్యేక హోదా కావొచ్చు, ప్యాకేజీ కావొచ్చు, ఆంధ్రాకు రావాల్సిన ప్రయోజనాలు ఏవైనా కావొచ్చు… అవి కొంతమంది నాయకుల ‘కష్టార్జితాలు’ ఎలా అవుతాయి..? అది ఆంధ్రా ప్రజల హక్కు అవుతుంది. కేంద్రం బాధ్యత అవుతుంది కదా!