కాపుల రిజర్వేషన్ల సమస్యకు అత్యంత త్వరలో పరిష్కారం లభించబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికలో మేనిఫెస్టోలో పెట్టిన హామీ తనకు గుర్తుందనీ, దాన్ని నెరవేర్చే బాధ్యత కూడా తనకు గుర్తుందని, ఎవరో గుర్తుచేయాల్సిన పనిలేదన్నారు. కాపుల రిజర్వేషన్ల అంశంపై ఆ సామాజిక వర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. నిజానికి, కాపులకు ఎప్పుడో రిజర్వేషన్లు ఉండేవనీ, సంజీవ రెడ్డి వచ్చిన తరువాత తీసేశారని, మళ్లీ ఆయనే రిజర్వేషన్లు కల్పిస్తే బ్రహ్మానంద రెడ్డి తీసేశారని చెప్పారు. ఆ తరువాత, చాలామంది ఇదే అంశమై పోరాటాలు చేశారుగానీ, ఫలితాలు రాలేదన్నారు. 2004లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని పెట్టారనీ, కానీ మిగిలినవారందరికీ ఇచ్చారుగానీ కాపు, బలిక, తెలగ, ఒంటరి కులాలను మాత్రం మినహాయించారన్నారు. మళ్లీ 2009లో కూడా ఇదే అంశాన్ని మరోసారి మేనిఫెస్టోలో పెట్టారు, కానీ పట్టించుకోలేదన్నారు. 2014లో ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులెవ్వరూ ఎక్కడా మేనిఫెస్టోలో ఈ అంశం ప్రస్థావించిన దాఖలాలు లేవనీ, గత ఎన్నికల సమయంలో తానొక్కడినే దీని గురించి మాట్లాడననీ, మానిఫెస్టోలో పెట్టామని చెప్పారు.
సామాజిక న్యాయం కోసం పోరాడటం చిన్నప్పట్నుంచే నేర్చుకున్నానని చంద్రబాబు అన్నారు. తాను విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే బలిజ విద్యార్థి నాయకుడిని యూనివర్శిటీ ఛైర్మన్ ను ఆరోజుల్లోనే చేశానని చెప్పారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో వివిధ వర్గాలకు సంబంధించి సమస్యలను తెలుసుకున్నానని, కాపుల్లో ఒక బాధ ఉందీ, వెనుకబడిపోయామనే ఓ ఆవేదన ఉందని ఆరోజే గుర్తించానన్నారు. ఆ తరువాత, పార్టీ నేతలతో చర్చించి.. కాపులకు వెనకబడిన వర్గాలతో సమానంగా రిజర్వేషన్ల అవసరం ఉందని గుర్తించి పిఠాపురంలో ప్రకటించామన్నారు. అయితే, ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేయాలన్నదే తన ఉద్దేశమనీ, ఎలాంటి సమస్యలూ లేకుండా ఉండేందుకే లీగల్ గా చాలామంది అభిప్రాయాలు తీసుకున్నాననీ, తరువాత కమిషన్ ఏర్పాటు వేశామని చెప్పారు. వీలైనంత తొందర్లోనే ఆ కమిషన్ నివేదిక ఇస్తుందనీ, ఆ తరువాత ఒక కాలపరిమితి పెట్టుకుని, క్యాబినెట్ లో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. తాను ఉన్నంత వరకూ కాపులకు అన్యాయం జరగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. వెనుబడిన వర్గాలకు అన్యాయం చేసేస్తున్నామంటూ కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ, అయితే వారు ఇప్పుడు పొందుతున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులూ ఉండవని, అదనంగా కాపుల్ని బీసీల్లో చేర్చుతామని చెప్పారు.
సో.. కాపుల రిజర్వేషన్ల అంశమై ముఖ్యమంత్రి ప్రసంగం ఇలా సాగింది. మంజునాథ కమిషన్ రిపోర్టు వచ్చే వరకూ ఆగాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేసినట్టయింది. రిజర్వేషన్ల అంశమై ప్రస్తుతం ఉన్న పరిస్థితినే ఆ సామాజిక వర్గానికి అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేశారు. ముద్రగడ ఉద్యమ తీవ్రత నుంచి దృష్టి మరల్చడంతోపాటు, ప్రతిపక్షం చేస్తున్న విమర్శల ప్రభావం కాపు సామాజిక వర్గంపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు కల్పించిన భరోసా రాజకీయంగా టీడీపీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు!