జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనపై చంద్రబాబు మండిపడ్డారు. తమను అసెంబ్లీలో బఫూన్ అన్నారని.. ఇవాళ ఆయనే పెద్ద బఫూన్ అయ్యారని తేల్చారు. ఇది పిచ్చి తుగ్లక్ పాలన అని మండిపడ్డారు. మూడు రాజధానుల్లో సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారని ప్రశ్నించారు. సీఎం ఇక్కడ కూర్చుంటారా? లేక విశాఖ, కర్నూలులో ఉంటారా?.. అని మండిపడ్డారు. జగన్ ప్రకటన వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు . ప్రజలు 3 రాజధానుల్లో తిరిగి పనులు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. మమ్మల్ని సస్పెండ్ చేసి రాజధానిపై నిర్ణయం ప్రకటించారని.. మండిపడ్డారు. 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా అని ప్రశ్నించారు.
మంత్రులను ఏ రాజధానిలో పెట్టబోతున్నారో చెప్పాలన్నారు. ఇలాంటి వ్యక్తులకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. బాధ్యత కలిగిన నాయకుడు చేయాల్సిన పని కాదని .. అన్ని రంగాల్లో ఏపీ వెనుకబడిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నిలదొక్కుకుంటున్న సమయంలో జగన్ వచ్చి అస్థిరపరిచారని.. భవిష్యత్లో జిల్లాకో ఆఫీసు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని జోస్యం చెప్పారు. జగన్ ఒక ఉన్మాది అని ఎప్పుడో చెప్పామని.. ప్రస్తుత నిర్ణయాలు ఉన్మాది పాలనకు ఇదే నిదర్శనమన్నారు.
కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ జీతాలు ఇవ్వడం లేదని.. భవిష్యత్లో చాలా విచిత్రాలు జరుగుతాయన్నారు. టీడీపీ సభ్యులు కేవలం నినాదాలు చేస్తున్నారన్న కారణంగా సస్పెండ్ చేసినప్పుడే.. జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారని స్పష్టమయింది. మూడు రాజధానుల ప్రకటనతో.. టీడీపీ షాక్కు గురయింది.