హైదరాబాద్: నిన్న వెలువడిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముక్తసరిగా స్పందించారు. “వరంగల్ ఫలితంపై మీ కామెంట్ ఏమిటి” అని విలేకరులు అడగగా, “కామెంట్ ఏముంది, సమీక్ష చేసుకుందాం” అని బాబు బదులిచ్చారు. వరంగల్ ఉపఎన్నికలో అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం తన మిత్రపక్షం బీజేపీకి వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ప్రచారంలో కూడా పాల్గొనకపోవటం చర్చకు దారితీసింది. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో కేసీఆర్‌తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకుంటున్నందునే బాబు ప్రచారంలో పాల్గొనలేదని, ఉపఎన్నికను అసలు పట్టించుకోలేదనే వాదన బలంగా వినిపించింది. మరోవైపు నిన్నటి ఫలితంలో టీఆర్ఎస్ అనూహ్య మెజారిటీ సాధించటంతో తెలంగాణ తెలుగుదేశం నేతలు షాక్ తిన్నారు. అభ్యర్థిత్వాన్ని బీజేపీకి వదిలి పెద్ద తప్పుచేసినట్లు భావిస్తున్నారు. దానికితోడు అభ్యర్థి దేవయ్యను నామినేషన్‌కు ముందురోజు ఖరారు చేయటంకూడా దెబ్బకొట్టిందని అభిప్రాయపడుతున్నారు.