ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మరోసారి కూడా అధికారంలోకి వచ్చిందంటే… గతంలో పరిపాలన సరిగా చేసినట్లు భావించాలి. అలా కాకుండా నిన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేడు అధికారంలోకి వచ్చిందంటే దానికి కచ్చితంగా ప్రతిపక్షం పోరాటం కంటే… అధికారపక్షం చేసిన తప్పులే ప్రధాన కారణంగా ఉంటుంది! ఈ విషయం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియంది కాదు! అయితే తాజాగా ఏపీలో అధికారులు తీసుకున్న నిర్ణయం మాత్రం ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం గా ఉన్న చోట జరగడమే విస్మయాన్ని రేకెత్తిస్తోంది.
వివరాళ్లోకి వస్తే… ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమయంలో జగన్ పర్యటించే ప్రాంతాల్లో పరిమితులు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా విపక్ష నేత పర్యటించాలనుకున్న ప్రాంతాలకు వెళ్లకుండా, వారు చెప్పిన చోట్లే పర్యటించాలని అధికారులు పరిమితులు విధించటం ప్రజల్లో ఎలాంటి సంకేతాలిస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ ఏయే ప్రాంతాల్లో పర్యటించాలన్న విషయాన్ని అధికారులు సిద్ధం చేయటం మరీ దారుణం అనే కామెంట్స్ ఇప్పటికే మొదలైపోయాయి!
నిజంగా చంద్రబాబు అండ్ కో చెబుతున్నట్లు రాజధాని రైతులంతా హాయిగా ఉన్నారు, ఆనందంగా భూములిచ్చారు అనే విషయంలో వాస్తవమై ఉంటే… ఆయా ప్రాంతాల్లో జగన్ పర్యటించినప్పుడు కూడా అదే విషయాన్ని తెలుసుకుంటారు కదా! అలా కాకుండా రాజధాని భూముల విషయంలో రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వారి భూములు ప్రభుత్వం లాక్కుని, వారిని రాజధాని బాధిత రైతులుగా మార్చినప్పుడు మాత్రం జగన్ పర్యటనను అడ్డుకుంటారనే సంకేతాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో తాజాగా అధికారులు తీసుకున్న నిర్ణయం.. ఈ పర్యటన వల్ల జగన్ కు కలిసొచ్చే అంశంగా కంటే.. ప్రభుత్వానికి హానీ చేస్తూ, ప్రజల్లో ప్రభుత్వం మీద నెగెటివ్ సంకేతాలు ఇచ్చే అంశంగా మిగులుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే… ఇలా ప్రతిపక్ష నేత పర్యటించే ప్రాంతాల్లో ఆంక్షలు విధించటం ద్వారా జగన్ కు పరోక్షంగా చంద్రబాబు మేలు చేస్తున్నారనే అనుకోవాలి. దీంతో జగన్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తే అవకాశాన్ని బాబుసర్కారు కల్పిస్తోందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం అనేది బాబుకు ఏమాత్రం మంచిది కాదని, ఇలాంటి నిర్ణయాలు భవిష్యతులో దిద్దుకోలేని తప్పులుగా మిగిలిపోతాయనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు!!