తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపైనే నెలకొంది. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. శనివారం సాయంత్రం ప్రజా భవన్ లో ఆరు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు భేటీ కానున్నారు.
విభజన సమస్యల పరిష్కారం దిశగా గతంలో ముఖ్యమంత్రులు ఎవరూ భేటీ కాలేదు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు మొదటిసారిగా సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వీరి భేటీలో షెడ్యూల్ 9, 10లో పొందుపరిచిన విభజన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విద్యుత్ సంస్థల బకాయిల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. 24వేల కోట్లు ఏపీ సర్కార్ చెల్లించాలని తెలంగాణ చెబుతుండగా..7వేల కోట్లు తెలంగాణ సర్కార్ తమకు ఇవ్వాల్సి ఉందని ఏపీ చెబుతోంది. దీంతో ఈ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పీటముడి నెలకొనడంతో.. శనివారం జరగబోయే భేటీలో ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ భవన్, మైనింగ్ కార్పోరేషన్ కు సంబంధించిన విభజన వివాదాలు పరిష్కారం అయ్యాయి.ఇక, షెడ్యూల్ 9లోని 91సంస్థల అప్పులు, ఆస్తులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబేడీ కమిటీ వేసింది. వీటిలోని 68సంస్థలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోగా, 23సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. షెడ్యూల్ 10లో 142సంస్థలో 30సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి.
దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన వివాదాలకు సంబంధించి పరిష్కారం దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.