గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
గిరిజన ప్రాంతాల్లోని మహిళల సౌకర్యం కోసం గర్భిణీ వసతి గృహాలు, ట్రైకార్ , జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ విధానాలతో గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు.
Also Read : రెవెన్యూ శాఖపై చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు!
ముఖ్యంగా వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లోని గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుండంతో ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టాలన్నారు.
గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి , అంబేడ్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకాలను వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గిరిజన గూడెంలను సైతం అభివృద్ధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం పాటుపడుతుందని.. ఇందుకోసం అధికారులు కృషి చేయాలన్నారు.