అభివృద్ధి వేగంలో ఆంధ్ర ప్రదేశ్‌తో తెలంగాణకు పోలికే లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్య తనకు బాధ కలిగించినట్టు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కెసిఆర్ మాటలపై చంద్రబాబు స్సందించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. ఇది కూడా విమర్శగానో వివాదంగానో గాక బాధతో సరిపెట్టడం విశేషం. నిన్న చెప్పుకున్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో కెసిఆర్ మాటలలో కొంత నమ్రత లోపించిన మాట నిజమే. తెలంగాణ అభివృద్ది గురించిన అతిశయోక్తులు ఎంత అనేది ఒకటైతే అదంతా ఈ మూడున్నరేళ్లలోనే జరగలేదని అందరికీ తెలుసు. హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాననే చంద్రబాబ మాటల్లో కొంత ఆత్మస్తుతి వున్నా కొంత నిజం కూడా వుంది గనకే కెటిఆర్ కూడా ఒప్పుకున్నారు. కాని నిజాం కాలంలో జరిగిన దాన్ని ఒప్పుకునే టిఆర్ఎస్ అధినేత టిడిపి హయాంలో జరిగిన భాగాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నాశనమై పోయిందనే పాట కూడా వినిపిస్తుంటుంది.ఈ నేపథ్యంలో కెసిఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన వూహించదగిందే. అందరూ అభివృద్ధి చేశారని 1995 తర్వాత అంటే తన పాలన మొదలైనాక పరిస్థితికీ అంతకుముందుకు మధ్య ఏది ఎలా వుండో పరిశీలిస్తే అంతా అర్థమైపోతుందని ఆయన అన్నారు. మరోవైపున విభజనప్రక్రియల్లో అన్యాయాలు వగైరా గురించి మళ్లీ చెప్పారు. హైదరాబాద్ కారణంగా ఆదాయంలో వ్యత్యాసాలున్నాయని అందిరకీ తెలుసు. అయినా ఎపితో పోల్చడమే తప్పయినట్టు కెసిఆర్ అనడం గాని దాంతోనే మళ్లీ పాత గాయాలు కెలుక్కోవడం గాని అనవసరం. కాకుంటే ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది ఇరు రాష్ట్రాల నేతలూ ప్రాంతీయ కోణాలు మళ్లీ ముందుకు తేవడం మాత్రం అనివార్యం. ఇరువైపులా ప్రజలు వాటిని ఓడించేందుకు సిద్ధంగా వుండాలి.