హైదరాబాద్: రాష్ట్ర విభజన చేసినవారు అసూయపడేలా రాజధాని అమరావతిని నిర్మిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద నిర్మించే ఏపీ తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి చంద్రబాబు ఇవాళ ఉదయం వేదమంత్రోచ్ఛారణలమధ్య శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమం తర్వాత మాట్లాడుతూ, ప్రపంచంలోని టాప్ 10లో ఏపీ రాజధాని ఉండేలా సంకల్పించామని ముఖ్యమంత్రి చెప్పారు. అవగాహన లేకుండా కొంతమంది ఇవి తాత్కాలిక భవనాలని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇవి తాత్కాలిక భవనాలు కాదని, శాశ్వత భవనాలని చెప్పారు. విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. కులాలు, మతాలు, ప్రాంతాలపేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతితో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఏపీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. తక్కువ సమయంలోనే 33 వేల ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. వెలగపూడికి, కృష్ణమ్మకు నమస్కరిస్తున్నానని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అన్నారు. 2019లో కూడా ఏపీకి లోటు బడ్జెట్ ఉంటుందని చెప్పారు. విభజన తీరుచూసి ఏపీ ప్రజలంతా దిగులుపడ్డారని అన్నారు. విభజనతో అనేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు.
జూన్ 15 నుంచి వెలగపూడినుంచే పాలన చేస్తామని చంద్రబాబు అన్నారు. మరోవైపు ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, యనమల, నారాయణ, పుల్లారావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత, పీతల సుజాత, స్పీకర్ శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్, మండలి ఛైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.