ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం ప్రతిపక్ష వైకాపా చేస్తోందని విమర్శించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కర్నూల్లో జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం గురించి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడారా అని ప్రశ్నించారు. ఆయనకు రెండే రెండు కత్తుల సమస్యలున్నాయన్నారు. ఒకటీ కోడి కత్తి అనీ, దానికీ మనకీ ఏమైనా సంబంధం ఉందా అనేది మీరే ఆలోచించాలని ప్రజలను కోరారు. సానుభూతి కోసం ఎవరో ఒక అభిమాని ఆయన భుజంపై గాయం చేస్తే, దాన్ని కావాలని పెద్దది చేసి లబ్ధి పొందే ప్రయత్నం జగన్ చేస్తున్నారని అన్నారు. ఇంకోపక్క, జగన్ మెడ మీద సీబీఐ కత్తి ఉందన్నారు. అది ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన కత్తి అన్నారు. తాను చెప్పినట్టు ఆడితే సీబీఐ ఏం చెయ్యదనీ, లేదంటే జైలుకు పోతావని మోడీ బెదిరిస్తుంటే… భయపడి తనపై విమర్శలకు దిగుతున్నారని చెప్పారు.
రూ. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారనీ, ఆరు లక్షల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్టే లేదనీ, ఇది నమ్మశక్యంగా ఉందా అని ఆయన ప్రజలను సీఎం ప్రశ్నించారు. రూ. 43 వేల కోట్లు దోచుకున్నారని జగన్ మీద ఆరోపణలున్నాయనీ, సీబీఐ ఛార్జ్ షీట్లు వేసిందనీ, కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తనకు ఒక్క రూపాయి అవినీతి చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. తనకు ఎలాంటి వ్యసనాలూ లేవనీ, ఎలాంటి తప్పులూ చేయకుండా పార్టీ నడుపుతున్న వ్యక్తిననీ, ప్రజల కోసమే పనిచేస్తున్నా అన్నారు. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రా మూడవ స్థానంలో ఉందన్నారు. జగన్ అవినీతి వల్ల ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లూ పారిశ్రామిక వేత్తలూ జైలుకి వెళ్లారని, ఈయన చుట్టుపక్కల ఉండేవారు కూడా జైలుకి వెళ్లారన్నారు. ఆయన అవినీతిలో కూరుకుపోయి… తన మీద బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారనీ, పూర్తిగా బురదలో కూరుకుపోయింది జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ ప్రాజెక్టు వచ్చినా అడ్డుపడతారనీ, అమరావతిలో రైతులే స్వచ్ఛందంగా భూములిస్తే.. అక్కడ అవినీతి అంటారనీ, పోలవరం ప్రాజెక్టు పాత రేట్లకే చేయిస్తే, అక్కడా అవినీతి జరిగింది అంటారనీ.. అంటే, అవినీతి చక్రవర్తులకు రాష్ట్రమంతా అవినీతే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యల దాడికే దిగారు ముఖ్యమంత్రి. ఓరకంగా ఎన్నికల ప్రచార అజెండాను కూడా సెట్ చేస్తున్న ప్రయత్నంగా ఈ వ్యాఖ్యల్ని చూడాలి. ఏ అనుభవమూ లేని, అవినీతి కేసుల్లో ఇరుక్కుని, కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలా…? లేదంటే, అవసరమైతే కేంద్రంతో సైతం పోరాడి, పట్టుదలతో రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వాలా అనే ప్రశ్నను రాబోయే ఎన్నికల్లో ప్రధాన ప్రచార అజెండాగా టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు.