కేంద్రం నుంచి రావలసిన నిధులు రాలేదన్న వాస్తవాన్ని నెమ్మదిగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శకు పెట్టక తప్పడం లేదు. ప్రత్యేక హౌదా లోటు భర్తీ విషయంలో రాజ్యాంగ బద్దమైన హామీలను రాజకీయ కారణాలతో మోడీ ప్రభుత్వం వమ్ము చేసింది. అయినా సరే అదే రాజకీయ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా విమర్శించలేదు. అందరినీ కలుపుకొని వత్తిడి చేసేందుకు కూడా సిద్ధపడలేదు. పైగా హౌదా స్థానంలో ప్రతిపాదించిన ప్రత్యేక ప్యాకేజీని ప్రశంసిస్తూ శాసనసభలో తీర్మానం చేయించింది. ఆ ప్యాకేజీ మిథ్య అని కేవలం అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గౌరవం కాపాడ్డానికి నడిచిన ప్రహసనమని అందరికీ తెలుసు. బహుశా అందుకే చంద్రబాబు కూడా దాన్ని విమర్శించకుండా పొగడ్తలు కురిపించారు. ఏమైనా ఒక ఏడాడి గడిచి పోయినా ప్యాకేజీతో వచ్చింది చాలా పరిమితం, నామమాత్రం. వచ్చే ఏడాది ఎన్నికల సంరంభం మొదలు. కనుకనే వరస మారింది. ఈ నెలలో ఇప్పటికి మూడు సార్లు చంద్రబాబు కేంద్రం నుంచి రావలసింది రాలేదని కొంత సూటిగానే చెబుతున్నారు. తాజాగా పోలవరం సమీక్షలోనూ 3000 కోట్లకు పైగా రావలసింది కేవలం వెయ్యి కోట్టే వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తను మాట్లాడిగే వెంకయ్యపై ప్రభావం పడే అవకాశం లేదు గనక ఒకింత స్వేచ్చ వచ్చిందన్నమాట.పైగా తాను ఇంత ఒదిగివున్నా ప్రధాని మోడీ ధోరణి మారకపోవడం తనను దూరం పెట్టడం చంద్రబాబుకు కష్టంగా వుండొచ్చు. అయితే ఇది వ్యక్తిగత వైముఖ్యం తప్ప రాజకీయంగా కలసి పోటీ చేయడం తప్పదని ఇద్దరికీ తెలుసు.
ఇదేగాక పోలవరం పనుల విషయంలో కూడా ముఖ్యమంత్రి కాస్త వాస్తవిక దృష్టితోమాట్లాడ్డం, నిర్వాసితుల సమస్యలు మిగిలివున్నాయని ఒప్పుకోవడం కూడా గమనించదగ్గది.విభజిత రాష్ట్రంలో సమస్యలే వుండవని ఎవరూ చెప్పరు. ఉన్నవి గుర్తించి పరిష్కార చర్యలు తీసుకోవాలనే కోరతారు.