అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇంకా గతంలో తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. గత ఐదేళ్లకాలంలో తనను మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పెట్టారని చంపాలని కూడా చూశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఢిల్లీ పర్యటన గురించి వివరాలు చెప్పేందుకు ఉండవల్లి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వేధించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల క్యాడర్ లో ఏర్పడిన అసంతృప్తి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్లలో అందరి కంటే ఎక్కువగా ఇబ్బందిపడ్డానని…జైల్లో తనను చంపాలని కూడా చూశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.. అలాంటి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష తీర్చుకోవాలి కదా అని ప్రశ్నించారు. అది తన స్వభావం కాదని .. అయితే.. ఎవరినైనా వదిలేస్తామనుకోవడం భ్రమేనని ఆయన చెబుతున్నారు. ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని తప్పు చేసిన వారందరికీ సరైన శిక్ష ఉంటుందన్నారు. దేనికైనా టైమింగ్ ముఖ్యమన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే.. ముందూ వెనుకా చూసుకోకుండా వేధించిన వారిపై చర్యలు తీసుకుంటే.. కక్ష తీర్చుకుంటున్నారన్న భావన ప్రజల్లో పెరిగిపోతుంది. కానీ ఆధారాలత సహా ఆ వేధించిన వారి తప్పుల్ని బయట పెట్టి.. చట్ట ప్రకారం శిక్షించేందుకు వ్యూహాత్మకంగా టీడీపీ పెద్దలు అడుగులు ముందుకు వేస్తున్నారని చంద్రబాబు ప్రకటన ద్వారా అంచనా వేయవచ్చని టీడీపీ క్యాడర్ ఓ అంచనాకు వస్తోంది.