హైదరాబాద్: 35 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నానని, ఎక్కడా ఏ తప్పూ చేయలేదని, భవిష్యత్తులో కూడా తప్పు చేసే సమస్య లేదని, చేయనని, చేయనివ్వనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇవాళ ఏలూరులో జరిగిన కాపు రుణమేళాలో పాల్గొన్న చంద్రబాబు, ఆ తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తనకు ఉన్నదే క్యారెక్టర్ అని చెప్పారు. తాను ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే, అభివృద్ధిపైన ఆలోచిస్తూ ఉంటే, మంచి పరిపాలన, నీతివంతమైన పాలన ఇవ్వాలని ఆలోచిస్తుంటే, రాష్ట్రాన్ని దోచుకున్నవాళ్ళు తనను విమర్శిస్తున్నారని, ఇది తనకు బాధ కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎప్పుడూ కూడా విధ్వంసాలు గానీ, విద్వేషాలు గానీ జరగవని చెప్పారు. ఈ రెండు జిల్లాలు నీతికి, నిజాయితీకి మారుపేర్లని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని అన్నారు. మంచితనానికి మారుపేరు ఈ జిల్లాలని, ఇక్కడ విధ్వంసాలు చేసేవారెవరూ లేరని చెప్పారు. కానీ మొన్న కొందరు కాపుల ముసుగులో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎక్కడ ప్రశాంతత ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు చెప్పారు.
బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చే సంవత్సరం కాపులకు రు.1,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. పేద కాపులను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని చెప్పారు.