‘ప్రజల మనసాక్షి సాక్షి’అని ఆ పత్రిక చెప్పుకొంటునప్పటికీ నిజానికి అది జగన్మోహన్ రెడ్డికే మనసాక్షి అని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న విద్వేషం, ఏహ్యత వగైరాలన్నిటినీ సాక్షి మీడియాలో చూడవచ్చును. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈనాడు సంస్థ యజమాని రామోజీరావుని ద్వేషిస్తునప్పుడు, సాక్షిలో రామోజీరావు గురించి చాలా అవహేళన చేస్తూ కార్టూన్లు, కధనాలు ప్రచురించబడ్డాయి. ఈనాడులో కూడా జగన్ అవినీతి గురించి చాలా కధనాలు ప్రచురించబడినా అవన్నీ ఆమోదయోగ్యమయిన బాషలోనే వచ్చేయి. ఆ తరువాత కారణాలు ఏవయితేనేమి, అంతవరకు తను ఏ రామోజీరావును ద్వేషిస్తూ, దూషిస్తూన్నారో జగన్మోహన్ రెడ్డి అయన వద్దకే వెళ్లి సాగిలపడవలసి వచ్చింది. అప్పుడు జగన్ ఆత్మగౌరవం ఏమయిందో ఆయనకే తెలియాలి. ఆ తరువాత నుండి సాక్షిలో రామోజీరావుకి వ్యతిరేకంగా వార్తలు, అవహేళన చేస్తూ కధనాలు ప్రచురించడం నిలిచిపోవాదం అందరికీ తెలుసు. అప్రస్తుతమయిన ఈ సంగతుల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే సాక్షి పత్రిక ప్రజల మనసాక్షి కాదు అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మనసాక్షి అని నొక్కి చెప్పడానికే.
గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు చేతిలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత నుండి సాక్షి పత్రిక జగన్ మనసాక్షిని ప్రతిభింబిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని నిత్యం విమర్శలు, అనేక వ్యంగ్య కధనాలు ప్రచురిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి పట్ల జగన్ కోపం పెరుగుతున్న కొద్దీ అది సాక్షిలో యధాతధంగా ప్రతిబింబించేది.
ఈ 22నెలల వ్యవధిలో తెదేపా ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయలేదన్నట్లుగానే దాని కధనాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వంపై నానాటికీ దాని విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏనాడూ తగ్గలేదు. రాజధాని భూములపై సాక్షిలో ప్రచురించిన వరుస కధనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సహనం కోల్పోయినట్లున్నారు. అందుకే అవినీతి సొమ్ముతో స్థాపించిన సాక్షి పత్రిక ప్రజల ఆస్తి అని, దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి ప్రజలకు అప్పగిస్తుందని కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి హెచ్చరించారు. అయినా సాక్షి మీడియా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ ప్రతిష్టకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గౌరవానికి, ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఇంకా వరుస కధనాలు, విమర్శలు కొనసాగిస్తూనే ఉంది.
చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తిగా తన సహనం కోల్పోయినట్లు కనిపించారు. తమ ప్రభుత్వంపై సాక్షి పత్రికలో చేసిన ఆరోపణలకు జగన్ కట్టుబడి వాటిని రుజువు చేయాలని లేకుంటే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు కూడా ఆయన మళ్ళీ సాక్షి పత్రికని స్వాధీనం చేసుకోవడం తధ్యమని చెప్పడం గమనిస్తే, ఆయన యధాలాపంగా ఆ మాట అనడం లేదని నిజంగానే సాక్షిని స్వాధీనం చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించడం గమనార్హం. ఇదివరకు ఎన్నడూ ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా హెచ్చరించలేదు. కనుక ఇకనయినా జగన్ మేలుకోవడం మంచిదేమో?