హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి దినపత్రికను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ అవినీతి పత్రిక ఎటాచ్‌మెంట్‌లో ఉందని, దానిని త్వరలో స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అది ప్రజల ఆస్తి అని, ప్రజలకు చెందుతుందని వ్యాఖ్యానించారు. విజయవాడలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, అవినీతి ఆస్తులను స్వాధీనం చేసుకునే బిల్లు ఢిల్లీలో ఆమోదం పొందిన వెంటనే ఎటాచ్‌మెంట్‌లో ఉండే ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సత్యం ఆస్తులు జప్తు చేశాక అవి ప్రభుత్వంవద్దకు వెళ్ళాయని గుర్తు చేశారు. అవినీతిపరుల ఆస్తులను తీసుకుంటామని, తన కోసం కాదని, ప్రజలకోసమని చెప్పారు. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టామని అన్నారు. ప్రత్యేక కోర్టునూ ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతపూర్ జిల్లా లేపాక్షి సెజ్ భూములనూ వదలబోమని, గత ప్రభుత్వం అక్కడ 15 వేల ఎకరాల భూమిని అక్రమంగా ధారాదత్తం చేసిందని ఆరోపించారు. అవినీతికి పాల్పడేవాళ్ళా మమ్మల్ని విమర్శించేదంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయం పెంపు, ఇతర విషయాల్లో తనపైన, తన కుమారుడిపైన సాక్షిలో వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తనకు అడ్డగోలుగా సంపాదించాల్సిన కక్కుర్తి తనకు లేదని చెప్పారు. జగన్ తన ఆస్తుల లెక్క ఎందుకు చెప్పటంలేదని ప్రశ్నించారు. తన భార్య భువనేశ్వరి – తండ్రి, భర్త ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేసినాకూడా – ఏనాడూ ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు. ఆమె కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం వల్ల హెరిటేజ్ సంస్థ ఈ ఏడాది రు.100 కోట్ల మేర లాభాలను ఆర్జించే స్థాయికి చేరుకుందని అన్నారు. తాను గడియారం, ఉంగరం వంటివి ధరించనని, అన్నింటికీ దూరంగా ఉండాల్సిన అవసరం తనకేమిటని అడిగారు. తానీ త్యాగం చేస్తున్నది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికే తప్ప, ఆస్తులు పెంచుకోటడానికి కాదని చెప్పారు.