ప్రత్యేకహోదా పోరాటాన్ని ఎన్నికలకు ముందు ఓ రేంజ్ కు తీసుకెళ్లాని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. అఖిలపక్ష భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 13వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. 11న ఢిల్లీలో ఆందోళన నిర్వహించి 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. హోదా సాధనకు జేఏసీ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించారు. అఖిలపక్ష భేటీకి రాని పార్టీలను కూడా జేఏసీలో చేరాలని ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. భవిష్యత్ ప్రణాళిక కోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహించామని.. రాజకీయలబ్ధి చూసుకుని కొన్ని పార్టీలు భేటీకి రాలేదేమోనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ప్రజాసంఘాలే గట్టిగా పోరాడాయన్నారు. ఒకటో తేదీన ప్రజాసంఘాలు చేపట్టనున్న బంద్ కు సంఘిభావం తెలియజేయలేము కానీ.. అదే రోజు బ్లాక్ డే పాటించాలని అనుకుంటున్నామన్నారు. ఢిల్లీ నిరసన దీక్షలో తాను, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు. మోదీ తన కంటే చాలా జూనియర్..అయినా.. ఆయన ఈగోను సంతృప్తిపర్చాలని సర్ అని సంభోదించానని చంద్రబాబు చెప్పారు. అయినా ఏపీపై మోదీ కనికరం చూపించలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడినవారిపై కేసులు ఎత్తివేస్తామని.. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే మూడు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించామని… అధికారంలోకి వచ్చిన బీజేపీ మాట మార్చి మోసం చేసిందన్నారు. లోటు బడ్జెట్ భర్తీ , ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం.. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకున్న అంశాలపై అఖిలపక్ష భేటీలో చర్చించారు. కేంద్ర వృద్ధి రేటు కంటే ఏపీలో వృద్ది రేటు అద్భుతంగా ఉందన్నారు. పెట్రో కెమికల్ కారిడార్‌ను చట్టంలో పెట్టి అమలు చేయలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్ సమావేశాల పేరుతో జాప్యం చేశారు. చివరికి సొంతంగా ప్లాంట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖ రైల్వే జోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అఖిలపక్ష నేతలకు గుర్తు ేచశారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తోందని… వీళ్ల కింద గుమాస్తా పనిచేసే వారిలా లెక్కలు అడుగుతున్నారని మండిపడ్డారు. పన్నులు కట్టకపోతే ఆ డబ్బుతో మేమే ఈ ప్రాజెక్టులన్నీ కట్టుకుంటామని కేంద్రానికి చంద్రబాబు హెచ్చరిక పంపారు.
ఏపీ హక్కుల కోసం పోరాటానికి అన్ని పార్టీలు కలిసిరావాలని సమావేశంలో పాల్గొన్న వారంతా విజ్ఞప్తి చేశారు. పార్టీలు అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరవడం సరికాదు లోక్ త్తా, రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఏపీకి నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు కూడా.. ఆందోళనలకు మద్దతు తెలిపాయి. రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో రెండు రోజుల దీక్ష చేయాలి, మానవహారం, సకల జనుల సమ్మెకు ఉద్యోగులు సిద్దమని అమరావతి ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు సీఎంకు తెలిపారు. ఒకటో తేదీన సచివాలయ సంఘం తరపున నిరసన ర్యాలీ చేస్తామని.. ప్రభుత్వ కార్యకలాపాల్ని ఆపకుండానే.. హోదా ఉద్యమానికి మద్దతు తెలియజేస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ ప్రకటించారు. ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, వైసీపీ, జనసేన ప్రతినిధులు హాజరు కాలేదు.