ఊహించినట్లుగానే, నేటి నుంచి తిరుపతిలో మొదలైన మహానాడు సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపన్యాసం చాలా చప్పగా సాగింది. సమైక్య రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని తాను ఏవిధంగా అభివృద్ధి చేసింది చెప్పుకొని, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. కేవలం తను మాత్రమే రాష్ట్రాన్ని గాడిన పెట్టగలననే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేసి తెదేపాకి అధికారం కట్టబెట్టారు కనుక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటానని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా వచ్చిన సమస్యల గురించి మళ్ళీ వివరించి, కేంద్రం సహాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదన్నట్లుగా మాట్లాడారు. అయినపట్టికీ ఉన్నంతలో రాష్ట్రాన్ని అబివృద్ధి చేయడానికి తన ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న ఆ ప్రయత్నాలకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు పదేపదే అడ్డుతగులుతున్నాయని, అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా తనను ఎవరూ ఆపలేరని చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా తన ప్రభుత్వ పాలన సాగిపోతోందంటూ, తన ప్రభుత్వం చేపట్టిన పలు పధకాల గురించి వివరించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు. పార్టీ కోసం తమ ఆస్తులను, చివరికి ప్రాణాలను కూడా త్యాగం చేసేంత గొప్ప కార్యకర్తలు తెదేపాకి ఉన్నారని వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో చాలా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా రెండు ముక్కలుగా చీల్చడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థతి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడగల స్థాయిలో నిలిపేందుకు తను గట్టిగా కృషి చేస్తానని, అందుకు కేంద్రం కూడా తన వంతు సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
యధారాజా తధా ప్రజా అన్నట్లుగా ఈ సమావేశాలకు హాజరైన పార్టీ నేతలు కూడా తమ నాయకుడి పంథాలోనే ప్రసంగాలు చేస్తారని భావించవచ్చు. ఈ సమావేశాలలో 27 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అది రాజకీయ్ పార్టీలకి తప్పనిసరిగా పాటించే ఆనవాయితీయే కావచ్చు కానీ వాటి వలన తెదేపాకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గానీ కొత్తగా ఒరిగేదేముంటుంది..సాధించేదేమిటి? అని సందేహం కలుగక మానదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణాలో తెదేపాకి గానీ వాటివలన ఏమాత్రం ప్రయోజనం కలిగినా చాలా మంచిదే. కానీ మహానాడు సమావేశాల ముగింపుతోనే ఆ తీర్మానాలన్నీ కట్టకట్టి అటకమీద పడేయడం ఖాయం. కనుక ఈ సమావేశాలలో తెలంగాణాలో పార్టీ భవిష్యత్, ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే రెండు అంశాలపై లోతుగా చర్చించి సమాధానాలు కనుగొంటే మహానాడు సమావేశాల విజయవంతం అయినట్లే.