పాదయాత్రలో నారా లోకేష్ సెల్ఫీ చాలెంజ్ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ తెచ్చిన పరిశ్రమలు, చేసిన అభివృద్ధితో పాటు జగన్ తెచ్చిన బెల్ట్ షాపులు.. ఇసుక అక్రమ రవాణా.. వైసీపీ నేతల భూకబ్జాలు వంటి వాటన్నింటిపై సెల్ఫీ చాలెంజ్ లు విసురుతున్నారు.. వాటికి వైసీపీ దగ్గర ఆన్సర్ లేకపోయింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ కు అదేసెల్ఫీ చాలెంజ్ విసిరారు.
నెల్లూరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు అక్కడ టిడ్కో ఇళ్ల దగ్గర ఆగారు. వాటితో సెల్ఫీ దిగారు. ఆ తర్వతా సోషల్ మీడియాలో సీఎం జగన్కు సవాల్ చేశారు. ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలని.. మీ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్ అవుతోంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ పేదలకు పక్కా భవనాలు నిర్మించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరు పట్టణ శివార్లలో అపార్ట్మెంట్లు నిర్మించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, లబ్ధిదారుడి బ్యాంకు రుణంతో కలిపి ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇళ్లను పంపిణీ చేసే క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో కార్యక్రమం ఆగిపోయింది. వైసీపీ సర్కారు వచ్చాక పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో పలుచోట్ల నిర్వహణ లేక పక్కా భవనాలు పాడుబడ్డాయి. అయితే తామే కట్టినట్లుగా చూపించుకోవడానికి హడావుడిగా రంగులేశారు. కానీ మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ఇవ్వలేదు.
ఇలాంటి టిడ్కో ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల వరకూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ లోకేష్ సెల్ఫీలు దిగి లబ్దిదారులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేశారు.. మరి వైసీపీ దగ్గర ఆన్సర్ ఉందా ?