ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పాలనపై ఎంతమంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే… 80 శాతం మంది అని ఆ మధ్యనే ఓ లెక్కల చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. అంతేకాదు.. మిగతా ఆ 20 శాతం కూడా సంతృప్తి సాధించాలంటూ నేతలూ మంత్రులూ కార్యకర్తలకూ దిశానిర్దేశం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, తాజాగా మహానాడు ముగిసింది. విశాఖపట్నంలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చెప్పిన లెక్కలు కాస్త విడ్డూరంగా అనిపిస్తున్నాయి! ఏం చేసినా ఘనంగా చెప్పుకోవడం టీడీపీ సర్కారుకు మొదట్నుంచీ అలవాటే కదా! అదే కోవలో మహానాడు ఎంత సూపర్ హిట్ అయిందో అనేది అంకెల్లో చెప్పారు.
మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని 11 లక్షలమంది నేరుగా వచ్చి తిలకించారట! ఇక, పరోక్షంగా అంటే ప్రసార మాధ్యమాల ద్వారా మహానాడును చూసినవారు 82 లక్షల మంది ఉన్నారని చంద్రబాబు లెక్కలు చెప్పారట. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ఓ కోటిమంది మహానాడును చూశారట. ఇంకా ఉంది… ఈ సందర్భంగా నిర్వహించిన సర్వేలో మహానాడు కార్యక్రమంపై 80 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పారట. వివిధ అంశాలపై 72 గంటలు చర్చ జరిగిందనీ, 34 తీర్మానాలు చేశామనీ, 94 ప్రసంగాలు జరిగాయని లెక్కలు చెబుతున్నారు.
మొత్తానికి, ఈ సర్వేలో కూడా 80 శాతం సంతృప్తి వ్యక్తమైందని చంద్రబాబు చెప్పడం గమనార్హం! ఇదే 80 అంకెను టీడీపీ పాలనపై ప్రజలు వ్యక్తం చేసిన సంతృప్తి శాతంగా గతంలో చెప్పారు కదా. అంటే, 80 అనేది ఆయనకు సెంటిమెంట్ ఫిగర్ ఏమో! మహానాడు ఎంత సూపర్ హిట్ అయిందని చెప్పడానికి ఈ లెక్కలు సరిపోతాయి కదా! అయితే, అసలు ప్రశ్న ఏంటంటే.. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యక్రమం. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి.. దాన్ని అధికారిక కార్యక్రమంగానే మార్చేశారని వేరే చెప్పాల్సిన పనిలేదు. కోటిమంది చూసినా.. అంతకుమించి చూసినా దాని గురించి ఇంత గొప్పగా అంకెలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కదా. ఇక్కడ జరిగిన తీర్మానాలు కావొచ్చు, గంటలు తరబడి సాగిన ప్రసంగాలు కావొచ్చు, రికార్డు స్థాయిలో వచ్చిన వ్యూవర్ షిప్ కావొచ్చు… ఇవన్నీ పార్టీ ప్రయోజనాల కోణం నుంచే ఉంటాయి. అయినా, ఎంత వ్యూవర్ షిప్ వచ్చింది అనేది రాజకీయ పార్టీ కార్యక్రమాల సక్సెస్ కు కొలమానంగా చెప్పుకోవడమేంటో..!